
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ EZI తన కొత్త స్కూటర్ EZI Ray 01 ను జూన్ నెలలో మలేషియాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. పట్టణ ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం, తక్కువ ధరతో మంచి ఫీచర్లను అందించడం ద్వారా వినియోగదారులను ఆకర్షించాలనే లక్ష్యంతో ముందుకొస్తోంది. ధర విషయానికొస్తే EZI Ray 01 ధర 2,288 మలేషియన్ రింగిట్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.54,000గా నిర్ణయించారు. ఈ ధర సెగ్మెంట్‌లో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలవనుంది. తెలుపు, నీలం, బూడిద, నలుపు వంటి నాలుగు రంగుల్లో ఈ వాహనం అందుబాటులోకి రానుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ స్కూటర్‌లో 2 kW శక్తి గల మోటార్‌తో పాటు 32 Ah సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. 72 వోల్ట్స్ విద్యుత్ వినియోగంతో పనిచేసే ఈ వాహనం గరిష్టంగా గంటకు 68 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. సాధారణంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో నడిపితే, ఒక్కసారి చార్జ్‌తో 120 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది.
భద్రత సౌకర్యాల విషయంలో కూడా EZI Ray 01 ఆకట్టుకునేలా రూపొందించారు. ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో డబుల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అందించారు. అలాగే హైడ్రాలిక్ బ్రేక్ వ్యవస్థను ఉపయోగించడం వల్ల బ్రేకింగ్ మరింత సమర్థవంతంగా ఉంటుంది. ఈ వాహనాన్ని మూడు స్పీడ్ మోడ్‌లలో నడపవచ్చు. మొత్తం బరువు 130 కిలోగ్రాములు కాగా, సీటు ఎత్తు 73.5 సెం.మీగా ఉంది. బ్యాటరీపై 2 సంవత్సరాలు లేదా 20,000 కిలోమీటర్ల వారంటీ ఇవ్వడం వినియోగదారులకు అదనపు నమ్మకాన్ని కలిగిస్తుంది. పట్టణ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ స్కూటర్, తక్కువ ఖర్చుతో స్మార్ట్ ప్రయాణానికి మంచి ఎంపికగా నిలిచే అవకాశం ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి