
స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో బ్యాటరీ త్వరగా ఖాళీ కావడం చాలా మందికి తలనొప్పిగా మారింది. అయితే కొన్ని చిన్న అలవాట్లు పాటిస్తే మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండేలా చేసుకోవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. మొదటిగా స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను అవసరానికి తగ్గట్టుగా ఉంచడం చాలా ముఖ్యం. ఎక్కువ బ్రైట్‌నెస్ బ్యాటరీని వేగంగా ఖర్చు చేస్తుంది. ఆటో-బ్రైట్‌నెస్ లేదా మాన్యువల్‌గా తక్కువ స్థాయిలో ఉంచితే బ్యాటరీ సేవింగ్‌లో మంచి మార్పు కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ టైమ్‌ఔట్‌ను 15 లేదా 30 సెకన్లకు సెట్ చేస్తే ఉపయోగం లేకుండా స్క్రీన్ వెలిగిపోవడం తగ్గుతుంది.
అనవసరంగా బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తున్న యాప్‌లను మూసివేయడం కూడా కీలకం. చాలా యాప్‌లు కనిపించకపోయినా డేటా, లొకేషన్, నోటిఫికేషన్‌ల ద్వారా బ్యాటరీని ఖర్చు చేస్తుంటాయి. అందుకే ఉపయోగించని యాప్‌లకు బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీని ఆఫ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్‌లో లొకేషన్, బ్లూటూత్, వై-ఫై వంటి ఫీచర్లు అవసరం లేకపోతే ఆఫ్‌లో ఉంచాలి. ఇవి నిరంతరం సిగ్నల్ కోసం శోధిస్తూ బ్యాటరీ వినియోగాన్ని పెంచుతాయి. అదే విధంగా డార్క్ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా ముఖ్యంగా AMOLED స్క్రీన్ ఉన్న ఫోన్లలో పవర్ సేవింగ్ ఎక్కువగా ఉంటుంది.
చార్జింగ్ అలవాట్లు కూడా బ్యాటరీ జీవితంపై ప్రభావం చూపుతాయి. ఫోన్‌ను పూర్తిగా 0 శాతం వరకు ఖాళీ చేయడం లేదా ఎప్పుడూ 100 శాతం వద్ద ఉంచడం మంచిది కాదు. సాధ్యమైనంత వరకు 20 శాతం నుంచి 80 శాతం మధ్యలో ఛార్జింగ్ ఉంచడం బ్యాటరీ ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. ఒరిజినల్ ఛార్జర్ వాడడం, వేడి ప్రదేశాల్లో ఫోన్ ఛార్జ్ చేయకుండా ఉండటం కూడా ముఖ్యమే. ఈ చిన్న మార్పులు పాటిస్తే మొబైల్ బ్యాటరీ ఎక్కువసేపు ఉండటమే కాకుండా, బ్యాటరీ జీవితకాలం కూడా పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి