LG Puricare Mask: కరోనా పుణ్యామాని మాస్కు వినియోగం తప్పనిసరిగా మారిపోయింది. ఒకప్పుడు మాస్కు ధరించేవారిని వింతంగా చూసేవారు కానీ ఇప్పుడు మాస్కు ధరించని వారికి వింతగానే కాదు కోపంగా కూడా చూసే పరిస్థితులు వచ్చాయి. కరోనా మన జీవితాల్లోకి వచ్చి ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. ఇప్పట్లో ఈ మాయదారి రోగం మనల్ని వదిలి పెట్టేలా కనిపించడం లేదు. దీంతో కరోనాతో జీవించడం అనివార్యంగా మారిపోయింది. ఈ క్రమంలోనే మాస్కు వినియోగం తప్పనిసరిగా మారిపోయింది. దీంతో మాస్కుల తయారీపై బడా సంస్థలు సైతం మొగ్గు చూపుతున్నాయి. ఎలక్ట్రానిక్ సంస్థలు కూడా మాస్కుల తయారీలోకి దిగడం ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం.
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్‌జీ మాస్కులను తయారు చేసే పనిలో పడింది. ప్యూరీకేర్ పేరుతో ఓ అధునాతన మాస్కును తీసుకురానున్నట్లు కంపెనీ ఇటీవలే ఓ కీలక ప్రకటన చేసింది. బిల్ట్ ఇన్ మైక్, స్పీకర్‌తో కూడిన మాస్కును తయారు చేసేందుకు ఎల్‌జీ సన్నాహాలు మొదలు పెట్టింది. మాస్కు ధరించడం కారణంగా ఎదుటి వారితో మాట్లాడడం కాస్త ఇబ్బందిగా మారుతోంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే దీనికి చెక్‌పెట్టడానికే ఎల్‌జీ వాయిస్ ఆన్ టెక్నాలజీని తీసుకొచ్చింది. దీంతో మాస్కు ధరించిన వ్యక్తి మాట్లాడినా అవతలి వారికి స్పష్టంగా వినిపిస్తుంది. 94 గ్రాముల బరువు ఉండే ఈ మాస్కులో 1000 ఎంఏ బ్యాటరీ కెపాసిటీతో, 8 గంటల పాటు నడుస్తుంది. అంతేకాకుండా ఈ మాస్కులో ఇన్‌బుల్ట్‌గా ఎయిర్ ప్యూరిఫయిర్‌ను అందించారు. దీంతో మాస్కు ధరించినా స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే వెసులుబాటు కలుగుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న 120 మంది థాయ్‌లాండ్ అథ్లెట్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి ఈ మాస్కులు అందించనున్నట్లు ఎల్‌జీ తెలిపింది. మరి ఇవి ప్రపంచ మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్న దానిపై ఎల్‌జీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
Also Read: Egg Freezing: అప్పుడే పిల్లలా..? ఎగ్ ఫ్రీజింగ్ అంటున్న ప్రజంట్ జనరేషన్.. నిపుణుల సీరియస్ వార్నింగ్..