
ఓ సినిమాలోని పవర్‌ఫుల్ డైలాగ్ వాడుతూ.. ఈ వాచ్‌కు ఎలివేషన్ ఇచ్చారంటే దాని ఫీచర్లు అలా ఉన్నాయి మరీ. నథింగ్ నుంచి వచ్చిన కొత్త స్మార్ట్‌వాచ్ CMF వాచ్ 3 ప్రో ఇప్పుడు భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. గ్లోబల్ మార్కెట్లో విడుదలైన దాదాపు ఏడాది తర్వాత ఈ వాచ్‌ను భారత్‌లో ప్రవేశపెట్టారు. ఫిట్‌నెస్ ప్రియులు, ఎక్కువ రోజుల బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ డివైస్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ధర విషయానికొస్తే సీఎంఎఫ్ వాచ్ 3 ప్రో అసలు ధర రూ.7,999 కాగా, ప్రారంభ ఆఫర్ కింద దీనిని రూ.6,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్ డార్క్ గ్రే, లైట్ గ్రీన్, లైట్ గ్రే, ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఇది అందుబాటులో ఉంటుంది.
ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. 466×466 రిజల్యూషన్, 326 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 670 నిట్స్ బ్రైట్‌నెస్ కారణంగా ఎండలో కూడా డిస్‌ప్లే క్లియర్‌గా కనిపిస్తుందని కంపెనీ చెబుతోంది. ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఫీచర్‌తో పాటు 120కు పైగా వాచ్ ఫేస్‌లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఫిట్‌నెస్ ఫీచర్ల పరంగా ఈ వాచ్‌లో డ్యూయల్ బ్యాండ్ జీపీఎస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది GLONASS, Galileo, BeiDou, QZSS వంటి శాటిలైట్ సిస్టమ్‌లకు సపోర్ట్ ఇస్తుంది. దీంతో రన్నింగ్, హైకింగ్ వంటి కార్యకలాపాల్లో కచ్చితమైన లొకేషన్ ట్రాకింగ్ లభిస్తుంది. అదనంగా 130కు పైగా స్పోర్ట్స్ మోడ్‌లు, ఆటో యాక్టివిటీ రికగ్నిషన్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఆరోగ్య పరంగా హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 ట్రాకింగ్, నిద్ర విశ్లేషణ, స్ట్రెస్ మానిటరింగ్, మహిళల ఆరోగ్య ట్రాకింగ్ వంటి ఫీచర్లు అందించారు. అలాగే హైడ్రేషన్ రిమైండర్లు, యాక్టివిటీ అలర్ట్‌లు కూడా ఉన్నాయి. ఈ వాచ్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో వస్తోంది. బ్లూటూత్ కాలింగ్, మ్యూజిక్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్, రిమోట్ కెమెరా షట్టర్, క్విక్ రిప్లై వంటి ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. 350mAh బ్యాటరీ సాధారణ వాడకంలో 13 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి