హలో తర్వాత ఎవరూ మాట్లాడట్లేదా? సైబర్ నేరగాళ్ల నెక్స్ట్‌ టార్గెట్‌ మీరే కావచ్చు

మీకు తరచుగా గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయా? మీరు ‘హలో’ అనగానే కాల్ కట్ అవుతోందా? అయితే ఇది సాధారణమైన రాంగ్ కాల్ కాదు, ప్రమాదకరమైన 'సైలెంట్ కాల్ స్కామ్' కావచ్చు. సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతిలో మీ ఫోన్ నంబర్‌ను టార్గెట్ చేస్తున్నారు. అసలు ఈ స్కామ్ వెనుక ఉన్న ప్రమాదం ఏమిటి?

హలో తర్వాత ఎవరూ మాట్లాడట్లేదా? సైబర్ నేరగాళ్ల నెక్స్ట్‌ టార్గెట్‌ మీరే కావచ్చు
Silent Call Scam.jpg

Updated on: Jun 18, 2026 | 8:50 PM

డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు రోజుకో కొత్త రూపం దాల్చుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ‘సైలెంట్ కాల్ స్కామ్’ వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. కాల్ రాగానే స్పందిస్తే, మీ నంబర్ యాక్టివ్‌గా ఉందని నేరగాళ్లు గుర్తించి, తర్వాత పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడతారు. ఈ మోసం బారిన పడకుండా ఉండాలంటే మీరు తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో, సైబర్ హెచ్చరికల గురించి తెలుసుకుందాం..

ఏమిటీ సైలెంట్ కాల్ స్కామ్?

సైలెంట్ కాల్ స్కామ్ అనేది సైబర్ నేరగాళ్లు రూపొందించిన ఒక కొత్త మోసపూరిత పద్ధతి. దీని ప్రకారం, అపరిచిత నంబర్ల నుంచి బాధితులకు పదేపదే కాల్స్ వస్తాయి. మీరు ఫోన్ ఎత్తి ‘హలో’ అని అనగానే, అవతలి వైపు నుంచి ఎటువంటి శబ్దం లేకుండా కాల్ కట్ అవుతుంది.

హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) దీనిపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నేరగాళ్లు ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా మీ ఫోన్ నంబర్ యాక్టివ్‌గా ఉందో లేదో పరీక్షిస్తారు. మీరు సమాధానం ఇవ్వగానే, మీ నంబర్ యాక్టివ్‌గా ఉన్నట్లు వారి డేటాబేస్‌లో రికార్డ్ అవుతుంది.

అసలు ప్రమాదం..

మీ నంబర్ యాక్టివ్‌గా ఉందని నిర్ధారించుకున్న తర్వాత, నేరగాళ్లు ఫిషింగ్ కాల్స్, నకిలీ కస్టమర్ కేర్ స్కామ్‌లు, పెట్టుబడి మోసాలు లేదా ఓటీపీ (OTP) చోరీ వంటి పనులకు పాల్పడతారు. మీ నంబర్‌ను ఒకసారి ధృవీకరించిన తర్వాత, రోజూ వేల సంఖ్యలో స్పామ్ కాల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం మీ వ్యక్తిగత గోప్యతకే కాకుండా, ఆర్థిక భద్రతకు కూడా పెను ప్రమాదం.

ఎలా జాగ్రత్తపడాలి?

సైబర్ నిపుణుల సలహాల ప్రకారం, అపరిచిత నంబర్ల నుంచి వచ్చే ఇలాంటి కాల్స్‌ను తేలికగా తీసుకోవద్దు:

  • బ్లాక్ చేయండి: ఒకే నంబర్ నుంచి పదేపదే సైలెంట్ కాల్స్ వస్తుంటే, వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేయండి.
  • తిరిగి కాల్ చేయకండి: కాల్ కట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఆ నంబర్‌కు కాల్ చేయకండి. దీనివల్ల మీ నంబర్ మరింత యాక్టివ్‌గా ఉన్నట్లు వారికే సంకేతాలు వెళ్తాయి.
  • హెచ్చరికలను గమనించండి: టెలికాం ఆపరేటర్లు స్పామ్ అని చూపిస్తున్న కాల్స్‌ను అస్సలు స్వీకరించకండి.
  • రిపోర్ట్ చేయండి: ఇటువంటి నంబర్లను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి. ఇలా చేయడం వల్ల నేరగాళ్ల నెట్‌వర్క్‌ను ట్రాక్ చేయడం అధికారులకు సులభమవుతుంది.

సైబర్ మోసగాళ్లు నిత్యం కొత్త దారులను అన్వేషిస్తుంటారు. కాబట్టి, తెలియని కాల్స్, మెసేజ్‌లు లేదా అనుమానాస్పద లింక్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండటమే మీరు సురక్షితంగా ఉండటానికి ఏకైక మార్గం. గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకండి. భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించకండి.

Follow Us