Apple: ఐఫోన్‌ 17 సూపర్‌ సక్సెస్‌.. కంపెనీకి భారీ లాభాలు! ఎంతంటే?

అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్‌ Q2 ఆర్థిక ఫలితాలు వాల్ స్ట్రీట్ అంచనాలను అధిగమించాయి. ఐఫోన్‌ 17 సిరీస్, బడ్జెట్ మ్యాక్‌బుక్‌ నియో అనూహ్య విజయం, అలాగే సేవల విభాగం బలమైన వృద్ధి దీనికి కారణం. కంపెనీ 111.18 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది, షేర్లు 4 శాతం ఎగిశాయి.

Apple: ఐఫోన్‌ 17 సూపర్‌ సక్సెస్‌.. కంపెనీకి భారీ లాభాలు! ఎంతంటే?
Iphone 17

Updated on: May 04, 2026 | 6:16 AM

అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్‌, మరోసారి ప్రపంచ మార్కెట్లను ఆశ్చర్యపరిచింది. కొత్త ఐఫోన్‌ 17 సిరీస్‌కు ఊహించని స్థాయిలో డిమాండ్ రావడం, అలాగే బడ్జెట్‌కు అనుకూలంగా తీసుకొచ్చిన మ్యాక్‌బుక్‌ నియో అనూహ్య విజయాన్ని నమోదు చేయడంతో, కంపెనీ తాజా త్రైమాసిక ఫలితాలు వాల్ స్ట్రీట్ అంచనాలను అధిగమించాయి. ఈ ఫలితాల ప్రకటన తర్వాత ట్రేడింగ్ ముగిసిన అనంతరం ఆపిల్ షేర్లు దాదాపు 4 శాతం వరకు ఎగిశాయి. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం మార్చి 28తో ముగిసిన ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆపిల్ మొత్తం 111.18 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది విశ్లేషకులు అంచనా వేసిన 109.66 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. ఒక్కో షేరుపై ఆదాయం కూడా 2.01 డాలర్లకు చేరుకుని మార్కెట్ అంచనాలను మించింది.

ఈ విజయానికి ప్రధాన కారణంగా ఐఫోన్‌ 17 నిలిచింది. ఆపిల్ సీఈఓ టిమ్‌ కుక్‌ మాట్లాడుతూ.. కొత్త ఐఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉందని తెలిపారు. అయితే అత్యాధునిక చిప్‌ల కొరత కారణంగా సరిపడా ఉత్పత్తి చేయలేకపోతున్నామని ఆయన వెల్లడించారు. ఈ త్రైమాసికంలో మాత్రమే ఐఫోన్ విక్రయాలు 56.99 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక విద్యార్థులు, బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా తీసుకుని విడుదల చేసిన మ్యాక్‌బుక్‌ నియో కూడా మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. సుమారు 500 డాలర్ల ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ ల్యాప్‌టాప్, తక్కువ ధర కంప్యూటర్ల విభాగంలో గూగుల్‌ LLC క్రోమ్‌బుక్స్‌కు గట్టి పోటీగా మారింది. దీంతో మ్యాక్ విభాగ అమ్మకాలు 8.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

అదే సమయంలో ఆపిల్ సేవల విభాగం కూడా బలమైన వృద్ధిని నమోదు చేసింది. యాప్ స్టోర్, యాపిల్‌ మ్యూజిక్‌ వంటి సేవల ద్వారా కంపెనీ 30.98 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించింది. చైనాలో కూడా అమ్మకాలు పెరిగి 20.5 బిలియన్ డాలర్లను తాకాయి. ఇదిలా ఉండగా, ఆపిల్ 100 బిలియన్ డాలర్ల భారీ షేర్ బైబ్యాక్ కార్యక్రమాన్ని ప్రకటించడం పెట్టుబడిదారుల్లో మరింత నమ్మకాన్ని పెంచింది. ఇక జూన్‌లో జరగనున్న యాపిల్‌ వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ 2026లో కంపెనీ తన కొత్త ఏఐ వ్యూహాలను ప్రకటించే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us