
మొదటి తరం iPhone Airలో సన్నని డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే సింగిల్ రియర్ కెమెరా, బ్యాటరీ సామర్థ్యం వంటి అంశాలపై కొందరు వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త మోడల్‌లో కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ విషయంలో కీలక మార్పులు చేయాలని Apple భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొత్త Siri AI ఫీచర్లు, తాజా iOS సాఫ్ట్‌వేర్ కూడా ఇందులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ వివరాలపై కంపెనీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.ఇప్పటికే అత్యంత సన్నని డిజైన్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న iPhone Air సిరీస్‌లో రెండో తరం మోడల్‌గా iPhone Air 2 రాబోతున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌ను వచ్చే ఏడాది స్ప్రింగ్ సీజన్‌లో విడుదల చేసే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి.
గతంలో Apple కొత్త ఐఫోన్లను ప్రధానంగా సెప్టెంబర్ ఈవెంట్‌లో విడుదల చేసేది. అయితే ఇప్పుడు కొన్ని మోడళ్లను వేర్వేరు సమయాల్లో పరిచయం చేసే ప్రణాళికలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో iPhone Air 2ను 2027 మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ప్రత్యేకంగా విడుదల చేసే అవకాశం ఉందని అంచనా. స్టోరేజ్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 256GB, 512GB, 1TB వేరియంట్లలో అందుబాటులోకి రావచ్చని ప్రచారం జరుగుతోంది.
భారత్‌లో దీని ప్రారంభ ధర సుమారు రూ.1.20 లక్షలుగా ఉండొచ్చని అంచనా. 512GB వేరియంట్ ధర రూ.1.40 లక్షలు, 1TB మోడల్ ధర రూ.1.60 లక్షల వరకు ఉండవచ్చని టాక్. అయితే విడిభాగాల ధరలు, ఇతర మార్కెట్ పరిస్థితుల ఆధారంగా తుది ధరల్లో మార్పులు ఉండొచ్చు.
iPhone Air 2లో కెమెరా విభాగంలో కీలక అప్‌గ్రేడ్ ఉండొచ్చని తెలుస్తోంది. మొదటి వెర్షన్‌లో సింగిల్ రియర్ కెమెరా మాత్రమే ఉండగా, కొత్త మోడల్‌లో వెనుకవైపు రెండు కెమెరాలను అందించే అవకాశం ఉంది. దీని మందం కేవలం 5.2 మిమీగా ఉండొచ్చని సమాచారం. సన్నని బాడీతో పాటు టైటానియం ఫ్రేమ్‌ను ఉపయోగించి దృఢత్వాన్ని పెంచనున్నట్లు అంచనాలు ఉన్నాయి. అలాగే గత మోడల్‌తో పోలిస్తే పెద్ద బ్యాటరీ, మరింత శక్తివంతమైన కొత్త ప్రాసెసర్‌ను ఇందులో అందించవచ్చని తెలుస్తోంది.
సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. iOS 27తో ఈ ఫోన్ అందుబాటులోకి రావచ్చని సమాచారం. ఇందులో అప్‌డేట్ చేసిన Siri AI ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. వినియోగదారులు మాట్లాడే మాటలను మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, వారు కోరిన పనులను చేయడంలో కొత్త Siri సహాయపడవచ్చని అంచనా. అయితే కెమెరా, డిజైన్, ధర, సాఫ్ట్‌వేర్ వివరాలన్నీ ప్రస్తుతానికి లీకులు, అంచనాల ఆధారంగానే ఉన్నాయి. Apple అధికారికంగా ప్రకటించిన తర్వాతే iPhone Air 2కు సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టమవుతాయి.