అదృష్టం అందరికీ ఒకేలా ఉండదు. కొందరు పుట్టుకతోనే అదృష్టవంతులుగా పేరుపోతారు. మరికొందరు నక్కతొక్కారేమో అన్నట్లుగా అనుకోని అదృష్టం కలిసివస్తుంది. అలాగే అనంతపురం జిల్లాలో ఓ యువకుడు జాక్‌పాట్ కొట్టాడు. లక్షీదేవి అతడిని కరుణించింది. కనక వర్షం కురిపించింది. ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పేలో స్క్రాచ్ కార్డు ద్వారా రూ.లక్ష రివార్డ్ వచ్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగింది.
అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన సూర్యప్రకాశ్ అనే వ్యక్తి స్థానికంగా ఓ ఫొటో స్టూడియో నడుపుకుంటూ జీవనోపాధిని పొందుతున్నాడు. అయితే, శుక్రవారం తన స్నేహితుడికి నగదు పంపించాడు. గూగుల్ పే యాప్ ద్వారా రూ.3 వేలు బదిలీ చేశాడు. ఆ వెంటనే అతనికి ఓ స్క్రాచ్ కార్డు వచ్చింది. ఎప్పటిలాగే అతడు సాధాసీదాగా స్క్రాచ్ చేశాడు. కానీ దాన్ని చూసిన వెంటనే తాను చూసిన నంబర్ నమ్మలేకపోయాడు. కొద్దిసేపటికే తన అకౌంట్లో రూ. 1,00,107 జమ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. తనకు వచ్చిన రివార్డు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నిజమా కాదా అని తేరుకోవడానికే కొంత సమయం పట్టింది. ఆ ఆఫర్ చూసిన అతని ఆనందానికి అవధులేకుండా పోయాయి. లక్ష రావడంతో సూర్య ఉబ్బితబ్బిబవుతున్నాడు. దీన్ని ఇంకా తాను నమ్మలేకపోతున్నానని చెప్పాడు. లక్కీగా వచ్చిన రూ.లక్షతో గోల్డ్ లోన్ తీరిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలిసిన వారంతా సూర్యప్రకాశ్ అదృష్టంపై చర్చించుకుంటున్నారు. జిల్లాతో పాటుగా సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.