మరోసారి రాష్ట్ర విభజన.. కేంద్రం ముందు తాజా ప్రతిపాదన.. త్వరలో నిర్ణయం తీసుకోనున్న మోదీ కేబినెట్

రాష్ట్రం మరోసారి విభజనకు గురి కాబోతోంది. ఈ ప్రతిపాదన గత కొన్నాళ్ళ నుంచీ వున్నా.. తాజాగా మోదీ సర్కార్ ఆ ప్రతిపాదనపై కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

మరోసారి రాష్ట్ర విభజన.. కేంద్రం ముందు తాజా ప్రతిపాదన.. త్వరలో నిర్ణయం తీసుకోనున్న మోదీ కేబినెట్
Follow us

|

Updated on: Nov 19, 2020 | 2:32 PM

State to bifurcate again: రాష్ట్రం మరోసారి విభజనకు గురి కాబోతోంది. ఈ ప్రతిపాదన గత కొన్నాళ్ళ నుంచీ వున్నా.. తాజాగా మోదీ సర్కార్ ఆ ప్రతిపాదనపై కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. తాజా ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే.. దేశంలో మరో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో త్వరలోనే మోదీ కేబినెట్ నిర్ణయం తీసుకునే సంకేతాలున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

దేశంలో పలు చిన్న రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఇంకా పెద్దగానే వున్నాయి. పరిపాలన పరంగా రాజధానులకు సుదూరంలోనే వుండిపోయాయి. ఇలాంటి రాష్ట్రాల కోవలోకి ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వస్తాయి. అయితే తాజా ప్రతిపాదన మాత్రం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి సంబందించినది. ఇదివరకే అంటే 2000 సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ ప్రాంతాన్ని వేరు చేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.

మొదట్నించి చిన్న రాష్ట్రాల పట్ల మొగ్గు చూపే బీజేపీ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా వున్నప్పుడు ఉత్తర ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్‌ను, మధ్య ప్రదేశ్ నుంచి చత్తీస్‌గఢ్‌ను, బీహార్ నుంచి జార్ఖండ్‌ను ప్రత్యేక రాష్ట్రాలుగా చేసింది. అయితే, రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఉత్తర ప్రదేశ్ ఇంకా పెద్ద రాష్ట్రంగానే వుంది. రాజధాని లక్నోకు సుదూరంలో పలు ప్రాంతాలున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌ను మూడుగా విభజించాలని గతంలో మాయావతి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది.

అప్పట్లో మాయావతి సర్కార్ చేసిన ప్రతిపాదనను ఇపుడు మోదీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు అభిఙ్ఞ వర్గాలు భోగట్టా. ఉత్తర ప్రదేశ్‌లో 20 జిల్లాల పరిధిలో విస్తరించి వున్న అవధ్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేస్తూ.. దానికి లక్నో రాజధానిగా చేసే అవకాశాన్ని కేంద్ర హోం శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేస్తూ దానికి ప్రయాగ్ రాజ్ (అలహాబాద్)ను రాజధానిగా చేసే అవకాశాలున్నాయి. బుందేల్‌ఖండ్ పరిధిలో 17 జిల్లాలుంటాయి. మరోవైపు పూర్వాంచల్ ప్రాంతంలోని 23 జిల్లాలను కలిపి గోరఖ్‌పూర్ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రంగా చేసే పరిస్థితి కనిపిస్తోంది. అదేసమయంలో సహరాన్‌పూర్ ఏరియాలోని కొంత ప్రాంతాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలిపే ప్రతిపాదనను హోం శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్ర విభజన ప్రతిపాదన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే జరిగే అవకాశాలున్నాయి హోం శాఖ వర్గాలంటున్నాయి.

ALSO READ: కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్.. సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి బాలీవుడ్ స్టార్ హీరో

ALSO READ: మంత్రి పేర్నినాని ఇంట్లో విషాదం.. పలువురి సంతాపం