
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీ నుంచి పాకిస్థాన్ తప్పుకుంటుందా? లేదా? అనే ఉత్కంఠ కొనసాగుతుండగానే.. పాక్ మాజీ దిగ్గజం రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఇప్పుడు తప్పుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదని, ఆ సమయం ఇప్పటికే మించిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.
టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి కేవలం కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టోర్నీలో పాల్గొనాలా? వద్దా? అనే మీమాంసలో పడింది. భద్రతా కారణాల రీత్యా భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో, ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించి స్కాట్లాండ్‌ను గ్రూప్-సి లోకి చేర్చింది. ఈ పరిణామంతో అప్రమత్తమైన పాక్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, తమ ప్రభుత్వం ఆదేశిస్తే తాము కూడా టోర్నీ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు. దీనిపై తుది నిర్ణయం ఫిబ్రవరి 2 (సోమవారం) నాటికి వెలువడే అవకాశం ఉంది.
అయితే, పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ మాత్రం బోర్డు తీరును తప్పుబట్టారు. “ఏ నిర్ణయానికైనా ఒక సమయం ఉంటుంది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే కొట్టాలి. బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ చర్చలు జరుపుతున్నప్పుడే పాక్ గట్టిగా నిలబడాల్సింది. ఇప్పుడు ఆ సమయం దాటిపోయింది” అని ఆయన విశ్లేషించారు. టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకోవడం కంటే, భారత్‌తో జరిగే మ్యాచ్‌లను బహిష్కరించడమే సరైన మార్గమని ఆయన కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్-పాక్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఒకవేళ పాక్ ప్రభుత్వం భారత్‌తో ఆడవద్దని చెబితే, ఐసీసీ ఆ నిర్ణయాన్ని అంగీకరించక తప్పదని లతీఫ్ పేర్కొన్నారు. ఒకవేళ ఫైనల్‌లో భారత్ ఎదురైనా సరే ఆడకూడదని, అప్పుడే ఐసీసీపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన సూచించారు. మరోవైపు ఈ టోర్నీ కోసం సల్మాన్ అలీ ఆఘా నాయకత్వంలో పాక్ ఇప్పటికే జట్టును ప్రకటించింది. మరి మొహ్సిన్ నఖ్వీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ పొందుతారా? లేక లతీఫ్ చెప్పినట్టు భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..