PKL 2024: ఢిల్లీ ధమాకా.. తమిళ్‌ తలైవాస్‌పై ఘన విజయం

|

Nov 08, 2024 | 10:27 PM

Pro Kabaddi League, PKL 2024: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో దబాంగ్‌ ఢిల్లీ కేసీ అదరగొట్టింది. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 39-26తో తమిళ్‌ తలైవాస్‌పై ఘన విజయం సాధించింది. లీగ్‌లో తమ కంటే మెరుగైన స్థితిలో ఉన్న తలైవాస్‌పై ఢిల్లీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఢిల్లీ తరఫున అషు మాలిక్‌(12) మరోమారు సూపర్‌-10 ప్రదర్శనతో విజృంభిస్తే..

PKL 2024: ఢిల్లీ ధమాకా.. తమిళ్‌ తలైవాస్‌పై ఘన విజయం
Dabang Delhi Thrashes Tamil Thalaivas
Follow us on

హైదరాబాద్‌, నవంబర్‌ 8: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో దబాంగ్‌ ఢిల్లీ కేసీ అదరగొట్టింది. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 39-26తో తమిళ్‌ తలైవాస్‌పై ఘన విజయం సాధించింది. లీగ్‌లో తమ కంటే మెరుగైన స్థితిలో ఉన్న తలైవాస్‌పై ఢిల్లీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఢిల్లీ తరఫున అషు మాలిక్‌(12) మరోమారు సూపర్‌-10 ప్రదర్శనతో విజృంభిస్తే..ఢిపెండర్లు యోగేశ్‌(7), అశిష్‌ మాలిక్‌(7), మను(5) రాణించారు. మరోవైపు అనూహ్య ఓటమి ఎదుర్కొన్న తలైవాస్‌ తరఫున నరేందర్‌(6), సచిన్‌(4), సాహిల్‌(4), మోయిన్‌(4) ఆకట్టుకున్నారు. ఈ విజయంతో దబాంగ్‌ ఢిల్లీ 24 పాయింట్లతో మూడో స్థానంలోకి వచ్చింది. తలైవాస్‌ మూడో ఓటమితో 5వ స్థానానికి పరిమితమైంది.

ఢిల్లీ దూకుడు:ప్రొ కబడ్డీ లీగ్‌లో రైవలరీ వీక్‌ రసవత్తరంగా సాగుతున్నది. లీగ్‌లో ముందంజ వేయాలంటే ప్రతీ మ్యాచ్‌ కీలకమైన నేపథ్యంలో ప్రతీ జట్టు తుదికంటా పోరాడుతున్నాయి. ఓవైపు ఢిల్లీ వరుస ఓటములతో సతమతమవుతుంటే మరోవైపు తమిళ్‌ తలైవాస్‌ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతున్నది. శుక్రవారం తమిళ్‌ తలైవాస్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ తమదైన దూకుడు కనబరిచింది. స్టార్‌ రైడర్‌ నవీన్‌ గైర్హాజరీలో అషు మాలిక్‌ ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌ 17వ నిమిషంలో అషు మాలిక్‌ పాయింట్ల ఖాతా తెరిచాడు. మరోవైపు 14వ నిమిషంలో డూ ఆర్‌ డై రైడ్‌కు వెళ్లిన నరేందర్‌ను యోగేశ్‌ ఔట్‌ చేయడంతో ఢిల్లీకి పాయింట్‌ వచ్చింది. ఆ తర్వాత రైడ్లలో కూడా నరేందర్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇదే అదనుగా ఢిల్లీ తమ వ్యూహాలకు పదునుపెట్టింది. ఓవైపు రైడింగ్‌కు తోడు డిఫెన్స్‌తో తలైవాస్‌కు చెక్‌ పెడుతూ ప్రథమార్ధం ముగిసే సరికి ఢిల్లీ 16-10తో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది.

అషు మాలిక్‌ విజృంభణ:

ప్రథమార్ధంలో పెద్దగా జోరు కనబర్చని ఢిల్లీ రైడర్‌ అషు మాలిక్‌..కీలకమైన ద్వితీయార్ధంలో పంజా విసిరాడు. రైడ్‌కు వెళ్లడం ఆలస్యం పాయింట్‌ పక్కా అన్న రీతిలో చెలరేగుతూ ఢిల్లీని ఆధిక్యంలో నిలుపడంలో కీలకమయ్యాడు. 20వ నిమిషంలో డూ ఆర్‌ డై రైడ్‌కు వెళ్లిన మను..అమిఈర్‌, అనూజ్‌ను ఔట్‌ చేసి ఢిల్లీకి రెండు పాయింట్లు అందించాడు. ఈ క్రమంలో 18వ నిమిషంలో అషు మాలిక్‌..సచిన్‌ను ఔట్‌ చేయడంతో తలైవాస్‌ తొలిసారి ఆలౌటైంది. ఓవైపు రైడింగ్‌లో అషు మాలిక్‌ అదరగొడితే డిఫెన్స్‌లో యోగేశ్‌, అశిష్‌ మాలిక్‌..తలైవాస్‌ పనిపట్టారు. ఎక్కడా పట్టు వదలకుండా పాయింట్ల వేటలో తలైవాస్‌పై ఢిల్లీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తలైవాస్‌ తరఫున నరేందర్‌, సచిన్‌, సాహిల్‌ రాణించినా జట్టును గెలిపించలేకపోయారు.