World Athletics Championship 2022: టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్‌కు అథ్లెటిక్స్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని అందించిన ఛాంపియన్ నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. అమెరికాలోని ఒరెగాన్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2022 ఫైనల్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో విసిరిన దానికంటే ఎక్కువ త్రో విసిరి అంటే 88.39 మీటర్ల దూరాన్ని అధిగమించి ఫైనల్‌కు చేరుకున్నాడు. దీంతో ఈ ఫైనల్‌లోనూ విజయం సాధిస్తే, సరికొత్త చరిత్ర నెలకొల్పనున్నాడు.
ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్, రోహిత్..
ప్రస్తుతం నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని సాధించాలంటే డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ సవాలును ఎదుర్కోవలసి ఉంటుంది. నీరజ్ చోప్రాతో పాటు, భారత ఆటగాడు రోహిత్ యాదవ్ కూడా పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో ఫైనల్స్‌కు చేరుకున్నాడు. నీరజ్ చోప్రాతో కలిసి రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.
దీంతో అభిమానులంతా ఈ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురచూస్తున్నారు. ఈ మ్యాచ్‌ని శనివారం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, టైమ్ జోన్ తేడా కారణంగా ఈ మ్యాచ్ ఆదివారం ఉదయం 7:05 గంటలకు భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఈవెంట్ ఫైనల్ ఒరెగాన్‌లోని హేవార్డ్ ఫీల్డ్‌లో జరగనుంది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సోనీ టెన్ 2, టెన్ 2 హెచ్‌డీ టీవీలలో ప్రసారం చేయనుంది. మొబైల్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు సోనీ OTT ప్లాట్‌ఫారమ్ Sony Livకి లాగిన్ చేయాల్సి ఉంటుంది.