ఫ్రెంచ్ ఓపెన్ రెండో సెమీఫైనల్ సందర్భంగా ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ బాలిక బలవంతంగా కోర్టులోకి ప్రవేశించి మెడలో వేసుకున్న గొలుసును నెట్‌కు కట్టేసి నేలపై మోకాళ్లపై కూర్చుంది. ఇది చూసిన ఆటగాళ్లు కోర్టు నుంచి బయటకు వచ్చేశారు. దీంతో కొద్దిసేపు ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. వెంటనే మ్యాచ్ అధికారులు వచ్చి బాలిక మెడలోంచి నెట్‌తో కట్టిన గొలుసును బయటకు తీశారు. కాసేపటి తర్వాత మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహిళా టీషర్ట్‌పై ‘మాకు 1028 రోజులే మిగిలి ఉన్నాయి’ అని రాసి ఉండడాన్ని గమనించవచ్చు. నిరసన తెలిపిన ఆమె పేరు అలీజీ, ఆమె వయస్సు 22 సంవత్సరాలు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎందుకు నిరసన వ్యక్తం చేసిందంటే?
ఆ అమ్మాయి డెర్నియర్ రెనోవేషన్ అనే ఉద్యమంతో సంబంధం కలిగి ఉంది. ఇది వాతావరణ మార్పుల గురించి ప్రదర్శిస్తోంది. వాతావరణ మార్పులపై ఫ్రాన్స్ కృషి చేయకపోతే, 1028 రోజుల తర్వాత ఏమీ మిగలదని వారు నమ్ముతున్నారు. నిరసన చేసిన అలీజీ పర్యావరణవేత్త అని కూడా చెబుతున్నారు.
మ్యాచ్‌లో ఏం జరిగింది?
2 గంటల 55 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో మారిన్ సిలిక్‌ను ఓడించి క్యాస్పర్ రూడ్ అద్భుత ఆటను ప్రదర్శించి ఫైనల్‌కు చేరాడు. అతను రాఫెల్ నాదల్‌తో తలపడనున్నాడు. 23 ఏళ్ల కాస్పర్ రూడ్ తొలి సెట్‌ను 3-6తో వెటరన్ ఆటగాడు మారిన్ సిలిక్ చేతిలో కోల్పోయాడు. ఆ తర్వాత, అతను రెండవ సెట్ నుంచి అద్భుతమైన పునరాగమనం చేశాడు. 6-4, 6-2, 6-2తో వరుసగా మూడు సెట్లను గెలుచుకున్నాడు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్స్‌లో డెన్మార్క్‌కు చెందిన 19 ఏళ్ల హోల్గర్ రూన్‌ను 6-1, 4-6, 7-6, 6-3 తేడాతో ఓడించి సెమీస్‌కు చేరుకున్నాడు.
కాస్పర్ రూడ్ మొదటిసారి నాదల్‌తో తలపడనున్నాడు. ఫైనల్‌కు చేరిన తర్వాత, నా ఆరాధ్యదైవంతో ఫైనల్‌లో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నానని వెల్లడించాడు. వీరిద్దరి మధ్య జూన్ 5న మ్యాచ్ జరగనుంది.