FIFA World Cup 2026 : 44 ఏళ్ల తర్వాత ఫిఫాలో అరుదైన రికార్డు.. అభిమానులకు పూనకాలు తెప్పించిన హై-స్కోరింగ్ మ్యాచ్

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఇంగ్లాండ్-ఫ్రాన్స్ మధ్య జరిగిన మూడో స్థానం పోరులో ఏకంగా 10 గోల్స్ నమోదయ్యాయి. 44 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ చరిత్రలో ఈ అరుదైన ఘనత నమోదైంది. ఇంగ్లాండ్ 6-4తో విజయం సాధించి మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

FIFA World Cup 2026 : 44 ఏళ్ల తర్వాత ఫిఫాలో అరుదైన రికార్డు.. అభిమానులకు పూనకాలు తెప్పించిన హై-స్కోరింగ్ మ్యాచ్
Fifa World Cup 2026

Updated on: Jul 19, 2026 | 8:02 AM

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన పోరు ఫుట్‌బాల్ చరిత్రలోనే ఒక అద్భుతమైన రికార్డును లిఖించింది. టోర్నమెంట్‌లో మూడో స్థానం కోసం జరిగిన ఈ హోరాహోరీ మ్యాచ్‌లో ఏకంగా 10 గోల్స్ నమోదై క్రీడాభిమానులను ఉర్రూతలూగించాయి. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 6-4 గోల్స్ తేడాతో బలమైన ఫ్రాన్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఇరు జట్ల ఆటగాళ్లు గోల్స్ చేయడానికి మైదానంలో పరుగెత్తిన తీరు, మ్యాచ్ చివరి నిమిషం వరకు ఉత్కంఠను రేకెత్తించింది.

ఫస్ట్ హాఫ్‌లో ఇంగ్లాండ్ వన్-మ్యాన్ షో

ఈ మ్యాచ్ ప్రారంభమైన మొదటి నిమిషం నుంచే ఇంగ్లాండ్ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట మొదలైన 3వ నిమిషంలోనే ఇంగ్లాండ్ ప్లేయర్ డెక్లాన్ రైస్ ‘డి’ బాక్స్ వెలుపల నుంచి ఒక అద్భుతమైన కిక్ కొట్టి బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. దీనితో ఇంగ్లాండ్‌కు 1-0 ఆధిక్యం లభించింది. ఆ వెంటనే ఫ్రాన్స్ జట్టు గోల్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ అది సఫలం కాలేదు. ఆ తర్వాత 18వ నిమిషంలో ఎజ్రీ కొన్సా మరో గోల్ చేసి ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 2-0 కు పెంచాడు. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి బుకాయో సాకా 37వ నిమిషంలో, 45+1వ నిమిషంలో వరుసగా రెండు గోల్స్ బాదడంతో ఇంగ్లాండ్ 4-0తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లగా, ఫ్రాన్స్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది.

రెండో హాఫ్‌లో తిరగబడ్డ ఫ్రాన్స్

రెండో హాఫ్ ప్రారంభం కాగానే మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు వెనుకబడిన ఫ్రాన్స్ జట్టు ఒక్కసారిగా ఎదురుదాడికి దిగింది. 48వ నిమిషంలో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబప్పే ఆ జట్టు తరఫున మొదటి గోల్ సాధించాడు. ఆ తర్వాత 54వ నిమిషంలో బ్రాడ్లీ బార్కోలా ఫ్రాన్స్‌కు రెండో గోల్ అందించాడు. మ్యాచ్ 66వ నిమిషంలో ఎంబప్పే మరో మెరుపు గోల్ చేయడంతో స్కోరు 3-4కు చేరింది. ఈ సమయంలో ఫ్రాన్స్ ఖచ్చితంగా పుంజుకుని మ్యాచ్ గెలుస్తుందని అందరూ భావించారు.. స్టేడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

పెనాల్టీ చాన్స్‌ను అద్భుతంగా మార్చేసిన ఇంగ్లాండ్ స్టార్

ఫ్రాన్స్ గట్టి పోటీ ఇస్తున్న తరుణంలో మ్యాచ్ 87వ నిమిషంలో ఇంగ్లాండ్ జట్టుకు ఒక సువర్ణావకాశం లభించింది. ప్రత్యర్థి తప్పు వల్ల ఇంగ్లాండ్‌కు పెనాల్టీ లభించగా, దానిని బుకాయో సాకా ఏమాత్రం తడబడకుండా గోల్‌గా మార్చాడు. దీనితో ఈ మ్యాచ్‌లో సాకా తన వ్యక్తిగత మూడో గోల్ (హాట్రిక్) పూర్తి చేయడమే కాకుండా ఇంగ్లాండ్ స్కోరును 5-3కు తీసుకెళ్లాడు. అయితే ఫ్రాన్స్ కూడా పట్టువదలకుండా పోరాడి 90+6వ నిమిషంలో ఉస్మానే డెంబ్లే ద్వారా నాలుగో గోల్ సాధించి స్కోరును 4-5కు తగ్గించింది.

చివరి నిమిషంలో జూడ్ బెల్లింగ్‌హామ్ విక్టరీ షాట్

మ్యాచ్ ముగియడానికి మరో రెండు నిమిషాలు ఉందనగా ఇంగ్లాండ్ స్టార్ జూడ్ బెల్లింగ్‌హామ్ తన క్లాస్ చూపించాడు. అదిరిపోయే షాట్‌తో అతను ఈ మ్యాచ్‌లో తన మొదటి గోల్‌ను నమోదు చేశాడు. ఇది ఈ మ్యాచ్‌లో నమోదైన 10వ గోల్ కావడం విశేషం. దీనితో నిర్ణీత సమయం ముగిసేసరికి ఇంగ్లాండ్ 6-4తో విజయం సాధించి టోర్నమెంట్‌లో అధికారికంగా మూడో స్థానాన్ని దక్కించుకుంది.ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో 1982 తర్వాత, అంటే సుమారు 44 సంవత్సరాల తర్వాత ఒకే మ్యాచ్‌లో ఇంత భారీ స్థాయిలో 10 గోల్స్ నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ రికార్డుతో ఈ మ్యాచ్ ఫుట్‌బాల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక చారిత్రాత్మక మ్యాచ్‌గా నిలిచిపోయింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us