Australian Open 2026 : పాత లెక్క సరిచేసిన కజకిస్థాన్ స్టార్..ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 విజేతగా రిబకినా

Australian Open 2026 : మెల్బోర్న్‌లోని రాడ్ లేవర్ అరేనాలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో అద్భుతం జరిగింది. ప్రపంచ నంబర్ 5 క్రీడాకారిణి ఎలెనా రిబకినా కనీవినీ ఎరుగని రీతిలో పుంజుకుని, ప్రపంచ నంబర్ 1 ఆర్యనా సబలెంకాపై విజయం సాధించింది. తొలి సెట్‌ను 6-4తో గెలుచుకున్న రిబకినా, రెండో సెట్‌లో 4-6తో ఓడిపోయింది.

Australian Open 2026 : పాత లెక్క సరిచేసిన కజకిస్థాన్ స్టార్..ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 విజేతగా రిబకినా
Elena Rybakina

Updated on: Jan 31, 2026 | 5:08 PM

Australian Open 2026 : మెల్బోర్న్‌లోని రాడ్ లేవర్ అరేనాలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో అద్భుతం జరిగింది. ప్రపంచ నంబర్ 5 క్రీడాకారిణి ఎలెనా రిబకినా కనీవినీ ఎరుగని రీతిలో పుంజుకుని, ప్రపంచ నంబర్ 1 ఆర్యనా సబలెంకాపై విజయం సాధించింది. తొలి సెట్‌ను 6-4తో గెలుచుకున్న రిబకినా, రెండో సెట్‌లో 4-6తో ఓడిపోయింది. నిర్ణయాత్మకమైన మూడో సెట్‌లో ఒక దశలో 0-3తో వెనుకబడినప్పటికీ, అసాధారణ పోరాట పటిమతో వరుస గేమ్స్ గెలిచి 6-4తో సెట్‌ను, టైటిల్‌ను కైవసం చేసుకుంది.

టెన్నిస్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల ఫైనల్ మ్యాచ్ ప్రేక్షకులను ఊపిరి బిగబట్టేలా చేసింది. కజకిస్థాన్‌కు చెందిన ఎలెనా రిబకినా తన కెరీర్‌లో మొదటిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో రిబకినా ప్రదర్శన మైమరిపించింది. మ్యాచ్ ప్రారంభంలోనే సబలెంకా సర్వీస్‌ను బ్రేక్ చేసి మొదటి సెట్‌ను 6-4తో తన ఖాతాలో వేసుకుంది. అయితే, ప్రపంచ నంబర్ 1 సబలెంకా అంత సులభంగా తలవంచలేదు. రెండో సెట్‌లో పుంజుకుని 6-4తో గెలిచి మ్యాచ్‌ను మూడో సెట్‌కు మళ్లించింది.

నిర్ణయాత్మకమైన మూడో సెట్‌లో సబలెంకా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 3-0తో ముందంజలో నిలిచింది. ఈ దశలో రిబకినా ఓడిపోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ అక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. రిబకినా తన సర్వీస్‌తో పాటు సబలెంకా సర్వీస్‌లను వరుసగా రెండుసార్లు బ్రేక్ చేసి స్కోరును సమం చేయడమే కాకుండా, 5-3 ఆధిక్యంలోకి వెళ్ళింది. చివరకు 6-4తో మూడో సెట్‌ను ముగించి చరిత్ర సృష్టించింది. 2022 వింబుల్డన్ తర్వాత రిబకినా గెలిచిన రెండో గ్రాండ్‌స్లామ్ ఇది.

మరోవైపు ఆర్యనా సబలెంకాకు ఇది కోలుకోలేని దెబ్బ. వరుసగా రెండో ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో ఆమెకు నిరాశే ఎదురైంది. 2023, 2024లో టైటిల్స్ గెలిచిన ఆమె, 2025లో మాడిసన్ కీస్ చేతిలో, ఇప్పుడు 2026లో రైబాకినా చేతిలో ఓటమి పాలైంది. 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో సబలెంకా చేతిలో ఓడిపోయిన రైబాకినా, మూడేళ్ల తర్వాత అదే వేదికపై ఆమెను ఓడించి ప్రతీకారం తీర్చుకోవడం విశేషం. ఈ విజయంతో రిబకినా మహిళల టెన్నిస్‌లో అత్యంత ప్రమాదకరమైన క్రీడాకారిణిగా తన స్థానాన్ని మరోసారి నిరూపించుకుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..