Diogo Jota : పెళ్లయిన 10రోజులకే.. రోడ్డు ప్రమాదంలో స్టార్ ప్లేయర్ కన్నుమూత

లివర్‌పూల్ ఫుట్‌బాలర్ డియోగో జోటా 28 ఏళ్ల వయస్సులో స్పెయిన్‌లో జరిగిన కారు ప్రమాదంలో మరణించాడు. 10 రోజుల క్రితమే వివాహం చేసుకున్న జోటా, తన సోదరుడితో పాటు ఈ ప్రమాదంలో కన్నుమూశాడు. పోర్చుగల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ సోషల్ మీడియాలో సంతాపాన్ని ప్రకటించింది.

Diogo Jota : పెళ్లయిన 10రోజులకే.. రోడ్డు ప్రమాదంలో స్టార్ ప్లేయర్ కన్నుమూత
Diogo Jota

Updated on: Jul 03, 2025 | 6:14 PM

Diogo Jota : ఫుట్‌బాల్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. లివర్‌పూల్ జట్టుకు ఆడే పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్ డియోగో జోటా గురువారం, జూలై 3న కారు ప్రమాదంలో మరణించారు. కేవలం 10 రోజుల క్రితమే ఆయన రుటే కార్డోసోను వివాహం చేసుకున్నారు. ఈ కారు ప్రమాదంలోనే అతని సోదరుడు కూడా మరణించాడు. పోర్చుగల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ సోషల్ మీడియాలో సంతాపాన్ని ప్రకటించింది. పోర్చుగల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో.. పోర్చుగల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్, మొత్తం పోర్చుగీస్ ఫుట్‌బాల్ కమ్యూనిటీ స్పెయిన్‌లో ఈ ఉదయం డియోగో జోటా, అతని సోదరుడు ఆండ్రే సిల్వా మరణం పట్ల దిగ్భ్రాంతి చెందాయి. నేషనల్ ‘ఏ’ టీమ్ కోసం సుమారు 50 మ్యాచ్‌లు ఆడిన డియోగో జోటా ఒక అసాధారణ వ్యక్తి. అతని సహచరులు, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా అతన్ని గౌరవించేవారు. ” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

డియోగో జోటా డిసెంబర్ 4, 1996న పోర్చుగల్‌లోని పోర్టోలో జన్మించాడు. జోటా 2014లో పోర్చుగల్ అండర్-19 జట్టులో చోటు సంపాదించాడు. ఐదేళ్ల తర్వాత 2019లో తను జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అతను 49 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, వాటిలో మొత్తం 14 గోల్స్ చేశాడు. లివర్‌పూల్ క్లబ్‌లో డియోగో జోటా 2020లో చేరాడు. ఈ క్లబ్‌తో ఐదేళ్ల కెరీర్‌లో అతను 123 మ్యాచ్‌లు ఆడి, 47 గోల్స్ సాధించాడు. డియోగో ఫార్వర్డ్, లెఫ్ట్ వింగర్ స్థానాల్లో ఆడేవాడు. లివర్‌పూల్‌తో కలిసి అతను ఇటీవల 2024-25 ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

డియోగో జోటా మరణం జూలై 3, 2025న స్పెయిన్‌లోని జమోరాలో జరిగింది. అతను నార్త్ పోర్చుగల్ నుంచి వెళ్తుండగా అతని కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డియోగోతో పాటు అతని సోదరుడు కూడా మరణించాడు. రోడ్డు నుంచి కారు పక్కకు వెళ్లి మంటలు అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జోటా సోదరుడు ఆండ్రే లిగా పోర్చుగల్ 2 జట్టు తరపున ఆడేవాడు. డియోగో జోటా, రుటే కార్డోసో కొన్నేళ్లు ప్రేమలో ఉన్నారు. జూన్ 22, 2025న ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. నిండా పది రోజులు నిండకముందే విషాదం చోటు చేసుకుంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..