Vinod Kambli financial struggle: ఒకప్పటి టీమిండియా స్టార్ క్రికెటర్ వినోద్ కాంబ్లి దీన గాథ ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. వయోభారం ఓ వైపు, కుటుంబ బాధ్యతలు మరోవైపు.. వెరసి ఈ వయసులో కూడా ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు కాంబ్లే తెలిపాడు. కరోనా తర్వాత కుటుంబ పోషణ భారంగా మారిందని.. బీసీసీఐ ఇస్తున్న రూ.30 వేల పెన్షన్‌తోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నానని వినోద్ కాంబ్లీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాంబ్లే దీనావస్థ ఆయన మాటల్లో..
‘ఉదయాన్నే 5 గంటలకు లేచి క్యాబ్‌లో డివై పాటిల్ స్టేడియానికి వెళ్లేవాడిని. ఫలితంగా చాలా అలసిపోయేవాడిని. అందువల్ల BKC గ్రౌండ్‌లో సాయంత్రం పూట శిక్షణ ఇచ్చేందుకు మారాను. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నందువల్ల బీసీసీఐ పెన్షన్ ఇస్తోంది. ప్రస్తుతం నా కుటుంబానికి బోర్డు పింఛనే ఆధారం. అందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) సహాయం కోసం ఎదురు చూస్తున్నా. క్రికెట్ ప్రోగ్రెస్ కమిటీలో నాకు స్థానం కల్పించారు. ఐతే అది గౌరవప్రదమైన హోదా. ప్రస్తుతం నా కుటుంబ పోషణకు ఆదాయం కావాలి. ఏదైనా పని ఉంటే చెప్పమని ఎంసీఏను చాలాసార్లు అడిగాను. నా పరిస్థితి గురించి సచిన్‌కి పూర్తిగా తెలుసు. టెండూల్కర్ మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీ (TMGA)లో కోచ్‌గా ఉద్యోగం లభించినా ఇంటికి దూరంగా ఉండటంమూలంగా ఆ ఉద్యోగంలో చేరలేకపోయాను. సచిన్ గొప్ప స్నేహితుడు. నాకు ఎప్పుడూ అండగా ఉంటాడని’ కాంబ్లీ తన పరిస్థితి గురించి వివరించారు.