లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ వీరోచిత పోరాటం చేసిన సంగతి తెలిసిందే. అద్భుతమైన అర్ధ సెంచరీతో అదరగొట్టిన ఈ బౌలర్.. బుమ్రాతో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తద్వారా భారత్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సరిగ్గా షమీ రేంజ్‌లో తాజాగా మరో టెయిలెండర్ అదరగొట్టాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికి ఆరేశాడు. తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ఆగష్టు 20వ తేదీ శుక్రవారం జింబాబ్వే, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ టెయిలెండర్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అందరిని అలరించాడు.
ప్రస్తుతం జింబాబ్వే, నమీబియా జట్ల మధ్య ఎమర్జింగ్ ప్లేయర్ల సిరీస్ కొనసాగుతోంది. సిరీస్ రెండో వన్డే శుక్రవారం జరిగింది. ఇందులో జింబాబ్వే ఎమర్జింగ్ ప్లేయర్స్ జట్టు నమీబియా ఈగల్స్‌పై 50 ఓవర్లలో 304 పరుగులు చేసింది. జింబాబ్వే టాప్ ఆర్డర్ అద్భుతంగా ఆడినా.. 40వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన టెయిలాండర్ ముంబా విజృంభించాడు. కేవలం 33 బంతుల్లో 9 సిక్సర్లు, 3 ఫోర్లతో ముంబా 242 స్ట్రైక్ రేట్‌తో 80 పరుగులు చేశాడు. ఇందులో ముంబా 12 బంతులకే 66 పరుగులు రాబట్టాడు. అతడి విజృంభణకు జింబాబ్వే 7.5 ఓవర్లలో 95 పరుగులు చేసింది.