వీడియో: 43 ఏళ్ల వయసులో ఇలాంటి క్యాచ్‌లా? జెన్‌ ఆల్ఫా కిడ్స్‌.. ఇతనే లెజెండ్‌ యువరాజ్‌ సింగ్‌ అంటే!

యువరాజ్ సింగ్, 43 ఏళ్ల వయసులోనూ తన అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు. ఇంటర్నేషనల్ మాస్టర్ లీగ్ 2025లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బౌండరీ లైన్ వద్ద అతని అద్భుతమైన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్యాచ్ యువరాజ్ అనుభవం, ఫిట్నెస్ ను సూచిస్తుంది. ఈ వీడియో చూసి యువతరం క్రికెటర్లు కూడా ప్రేరణ పొందొచ్చు.

వీడియో: 43 ఏళ్ల వయసులో ఇలాంటి క్యాచ్‌లా? జెన్‌ ఆల్ఫా కిడ్స్‌.. ఇతనే లెజెండ్‌ యువరాజ్‌ సింగ్‌ అంటే!
Yuvraj Singh

Updated on: Feb 23, 2025 | 7:01 AM

ప్రస్తుతం క్రికెట్‌ అభిమానులంతా ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే శనివారం రాత్రి ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో పరుగుల వరద చూసుంటారు. కానీ, చాలా మంది ఓ అద్భుతం మిస్ అయ్యారు. అది ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ లీగ్‌ 2025లో చోటు చేసుకుంది. అది ఇలాంటి అలాంటి అద్భుతం కాదు.. నైన్టీస్‌ కిడ్స్‌ ఎవరైనా ఆ వీడియో చూస్తే కళ్లల్లో ఒక్కసారిగా సంతోషంతో నీళ్లు తిరుగుతాయి. అంత గొప్ప అద్భుతం అది. ఒకప్పటి టీమిండియా బెస్ట్‌ ఫీల్డర్‌, భారత్‌కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌, ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌.

ఇండియన్‌ క్రికెట్‌ చరిత్రలో అతని పేరు బంగారు అక్షరాలతో కాదు.. అంతకంటే విలువైన ఖనిజంతో రాసినా అతని ఆటకు సరితూగదు. బ్యాటర్‌గా, బౌలర్‌గా, ఫీల్డర్‌గా.. టీమిండియాకు కొండంత అండలా ఉండేవాడు. క్యాన్సర్‌ మహమ్మారితో పోరాడాతూ.. గ్రౌండ్‌లో నెత్తురు కక్కుతూ కూడా ఇండియా కోసం బ్యాటింగ్‌ చేసిన వీరుడు. పాయింట్‌లో అతను ఫీల్డింగ్‌ చేస్తుంటే బాల్‌ అతన్ని దాటి వెల్లడం కల్లా. యువరాజ్‌ సింగ్‌ టైమ్‌లో మొహమ్మద్‌ కైఫ్‌, సురేష్‌ రైనా వంటి మంచి ఫీల్డర్లు ఉన్నా కూడా యువీ పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తుంటే అడ్డంగా ఓ 20 అడుగుల గోడ కట్టినట్లు ఉండేది. అలాంటి ఆటగాడు ఇప్పుడు 43 ఏళ్ల వయసులో కూడా ఓ సూపర్‌ క్యాచ్‌ అందుకున్నాడు.

ఆ క్యాచ్‌ చూస్తే ఇప్పటి జెనరేషన్‌ యంగ్‌ క్రికెటర్లు కూడా కుళ్లుకోవాల్సిందే. ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ లీగ్‌ 20లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్‌ బౌండరీ లైన్‌ వద్ద అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ మూడో బంతికి శ్రీలంక ఆటగాడు లాహిరు తిరిమన్నే మిడ్‌ వికెట్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. సరిగ్గా బౌండరీ లైన్‌ వద్ద గాల్లోకి ఎగురుతూ యువీ బంతిని ఒడిసి పట్టుకున్నాడు. వెనుక వైపుకు దూకుతూ క్యాచ్‌ను సురక్షితంగా పూర్తి చేశాడు. యూవీ ఆ క్యాచ్‌ పట్టిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు కూడా కిందున్న ఆ వీడియోను చూసేయండి.

ఇక నవీ ముంబైలోని డీవై పాటిల్‌స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్‌ జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ ఇండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు రాయుడు 5, సచిన్‌ 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చినా.. గుర్‌క్రీత్‌ సింగ్‌ 44, బిన్నీ 68, యువరాజ్‌ సింగ్‌ 31 (నాటౌట్‌), యూసుఫ్‌ పఠాన్‌ 56 (నాటౌట్‌) పరుగులతో రాణించారు. ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక మాస్టర్స్‌ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఆ జట్టు కెప్టెన్‌ కుమార సంగాక్కర 51 పరుగులు, జీవన్‌ మెండిస్‌ 42 పరుగులు చేసి రాణించారు. ఇండియా మాస్టర్స్‌ బౌలర్లో ఇర్ఫాన్‌ పఠాన్‌ 3 వికెట్లు సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.