
Temba Bavuma Reported Hearing the Term “choke” from Australian Players: క్రికెట్‌లో స్లెడ్జింగ్ అనేది ఆటలో భాగమే అయినప్పటికీ, కొన్నిసార్లు అది హద్దులు దాటుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో దక్షిణాఫ్రికా చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా ఆస్ట్రేలియాపై సంచలన ఆరోపణలు చేశాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్లు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లను “చోక్” (Choke) అనే పదాన్ని ఉపయోగించి రెచ్చగొట్టారని బావుమా వెల్లడించారు.
27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ విజయం..
దక్షిణాఫ్రికా క్రికెట్‌కు “చోకర్స్” అనే అపవాదు ఎప్పటినుంచో అంటుకుంది. ఐసీసీ టోర్నమెంట్లలో కీలక సమయాల్లో ఒత్తిడికి గురై ఓడిపోవడం వారికి పరిపాటిగా మారింది. అలాంటి చరిత్ర ఉన్న జట్టు, 27 ఏళ్ల తర్వాత ఒక ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడం (WTC 2025 ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి) ఒక అద్భుతమైన ఘట్టం. ఈ విజయం వారిపై ఉన్న “చోకర్స్” ట్యాగ్‌ను కొంతవరకు చెరిపేసింది.
బావుమా సంచలన వ్యాఖ్యలు..
WTC ఫైనల్ విజయం తర్వాత బీబీసీ టెస్ట్ మ్యాచ్ స్పెషల్‌తో మాట్లాడిన టెంబా బావుమా, ఆస్ట్రేలియా ఆటగాళ్ల స్లెడ్జింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. “మేం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆ ‘భయంకరమైన పదం’ (dreaded word) ‘చోక్’ను ఉపయోగిస్తూ ఉన్నట్లు మేం వినగలిగాం,” అని బావుమా తెలిపాడు.
అంతేకాకుండా, “మేం చాలా నమ్మకంతో వచ్చాం, చాలా మంది మాపై సందేహాలు వ్యక్తం చేశారు. మేం ఫైనల్‌కు చేరుకున్నాం, మేవ వెళ్ళిన మార్గం గురించి కూడా చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఈ గెలుపు వాటన్నింటినీ పటాపంచలు చేసింది. మా దేశానికి ఇది ఒక అవకాశం, ఎంతగానో విభజించబడిన మా దేశం, ఒక్కటి కావడానికి ఇది ఒక అవకాశం,” అని బావుమా భావోద్వేగంగా వ్యాఖ్యానించాడు.
మహారాజ్ ఆశాభావం..
దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ కూడా “చోకర్స్” ట్యాగ్‌పై స్పందించాడు. “ఆ పదాన్ని మళ్లీ ఎప్పటికీ వినకపోవడం చాలా గొప్పగా ఉంటుంది. ఈ పనిని పూర్తి చేసి, ఆ ట్యాగ్‌ను వదిలించుకోవడం మా జట్టుకు చాలా పెద్ద విషయం,” అని మహారాజ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఆస్ట్రేలియా వ్యూహం..
ఆస్ట్రేలియా జట్టుకు స్లెడ్జింగ్ అనేది ఆటలో భాగంగానే ఉంటుంది. ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసి, ఒత్తిడికి గురిచేయడానికి వారు తరచుగా ప్రయత్నిస్తుంటారు. WTC ఫైనల్‌లో దక్షిణాఫ్రికా విజయం అంచున ఉన్నప్పుడు, వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి “చోక్” అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా ఆస్ట్రేలియా ఈ ప్రయత్నం చేసింది. అయితే, ఈసారి దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఒత్తిడికి లొంగకుండా, అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి విజయం సాధించారు.
టెంబా బావుమా చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో చర్చకు దారితీశాయి. స్లెడ్జింగ్ అనేది ఎంతవరకు అనుమతించాలి, దాని ప్రభావం ఆటగాళ్లపై ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే, దక్షిణాఫ్రికా ఈ విజయంతో తమపై ఉన్న అపవాదును తొలగించుకోవడానికి ఒక బలమైన అడుగు వేసింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..