
WPL 2026 : మహిళా క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజూ రానే వచ్చింది. నేటి నుంచి విమెన్స్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ ఘనంగా ప్రారంభం కానుంది. కేవలం క్రికెట్ మాత్రమే కాదు, గ్లామర్, వినోదం కలగలిసిన భారీ ఓపెనింగ్ సెరిమనీతో ఈ లీగ్ సందడి షురూ కానుంది. నవీ ముంబై వేదికగా జరగనున్న ఈ వేడుకలో క్రికెట్ అభిమానులకు కన్నుల పండువ కలగడం ఖాయం.
నేడు అంటే జనవరి 9, శుక్రవారం సాయంత్రం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ వేడుకలు జరగనున్నాయి. రాత్రి 7:30 గంటలకు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమవుతుంది. దీనికంటే సరిగ్గా ఒక గంట ముందు, అంటే సాయంత్రం 6:30 గంటలకు మెరిసే కాంతుల మధ్య ఓపెనింగ్ సెరిమనీ మొదలవుతుంది.
ఈ సారి ఓపెనింగ్ సెరిమనీని బీసీసీఐ చాలా స్పెషల్ గా ప్లాన్ చేసింది. ప్రముఖ సింగర్ యో యో హనీ సింగ్ తన పాపులర్ పాటలతో స్టేడియంలో జోష్ నింపనున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అలరించనుంది. విశేషమేమిటంటే, మాజీ మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు కూడా ఈ వేడుకలో మెరవనున్నారు. దీంతో క్రికెట్ గ్రౌండ్ అంతా సెలబ్రిటీల వెలుగులతో నిండిపోనుంది.
ఈ అద్భుతమైన వేడుకను, మ్యాచ్‌లను అభిమానులు టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు. ఒకవేళ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో చూడాలనుకుంటే జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లో ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఈ డిజిటల్ విందును ఎంజాయ్ చేయవచ్చు.
ఈ సీజన్‌లో మొత్తం ఐదు జట్లు – ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడనున్నాయి. మొత్తం 22 మ్యాచ్‌లు జరగనుండగా, లీగ్ మ్యాచ్‌లు నవీ ముంబైలో జరుగుతాయి. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు వడోదరలోని కోటాంబి స్టేడియంలో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 5వ తేదీన ఈ గ్రాండ్ టోర్నీకి ముగింపు పలకనున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..