మాంచెస్టర్: వరల్డ్ కప్‌లో ధోనీ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో చివరివరకు ఆడి నాటౌట్‌గా నిలిచిన ధోనీ(56నాటౌట్; 61బంతుల్లో 3×4, 2×6) హాఫ్ సెంచరీతో రాణించినా కూడా అభిమానులు సంతృప్తి చెందలేదు. ఫ్యాన్స్ మాత్రమే కాదు..మాజీ ప్లేయర్లు సైతం ఎమ్మెస్డీ ఆటతీరుపై పెదవి విరుస్తున్నారు.
ధోని ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 29 ఓవర్‌లో కేదార్ జాదవ్(7) ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన ధోనీ నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. భారీ షాట్స్ ఆడని ధోని కేవలం సింగిల్స్‌తో స్ట్రైయిక్ రొటేట్ చేశాడు.
దీనిపై లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ధోనీ ఎప్పటిలాగే ఫినిషింగ్‌లో తన మార్క్ షాట్స్‌తో ఆకట్టుకున్నాడు. అది జట్టుకు బాగా కలిసొచ్చే అంశమే. అయితే స్టార్టింగ్‌లో కూడా అదే రేంజ్ ఆటతీరు కనపరిస్తే బాగుండేది. కానీ అందుకు విరుద్ధంగా నిదానంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లోనూ అతను ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. స్ట్రైక్ రేట్ కూడా 50కి మించకపోవడం అసంతృప్తికి గురి చేసింది’ అని పేర్కొన్నాడు.
‘ఏదో ఒక రోజు ఈ విషయంలో ధోనీకి కూడా అలాంటి భావనే కలగవచ్చు . ఇన్నింగ్ నిదానంగా ఆరంభిస్తున్నట్లు తాను కూడా బాధపడతాడు. అంతకుముందు అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ అతను ఇబ్బంది పడ్డాడు. మరోవైపు హార్దిక్ పాండ్యలా ఆరంభం నుంచే పాజిటీవ్ థింకింగ్‌తో మహి ఆడలేకపోయాడు’ అని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. మరోవైపు భారత అభిమానులు కూడా ధోని ఆటతీరుపై సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.