BCCI : రోహిత్, కోహ్లీ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక ప్రకటన..అభిమానుల సందేహాలకు తెరదించినట్లేనా ?

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తుపై అభిమానుల్లో ఉన్న సందేహాలకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెరదించారు. 2027 ప్రపంచ కప్‌లో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు వన్డే క్రికెట్లో అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాగే 2027వరల్డ్ కప్ ఆడుతారని స్పష్టం చేశారు.

BCCI : రోహిత్, కోహ్లీ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక ప్రకటన..అభిమానుల సందేహాలకు తెరదించినట్లేనా ?
Will Kohli

Updated on: Jul 16, 2025 | 8:45 AM

BCCI : భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి సడన్‌గా రిటైర్ అవ్వడం అందరినీ షాక్‌కు గురిచేసింది. దీనితో వారి భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా, 2027లో జరగబోయే ప్రపంచ కప్‌లో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఆడతారా, లేదా అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదిలింది. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఈ ఇద్దరు ఆటగాళ్ల భవిష్యత్తుపై వివరణ ఇచ్చి, అభిమానుల సందేహాలకు తెరదించారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి తప్పుకున్న తర్వాత వారి భవిష్యత్తుపై వస్తున్న వార్తలపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా లండన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. రోహిత్, విరాట్ ఇద్దరూ 2027 ప్రపంచ కప్‌లో ఆడటానికి రెడీగా ఉన్నారు, వారు వన్డే క్రికెట్‌కు అందుబాటులో ఉన్నారని తెలిపారు. “రోహిత్, విరాట్ లేని లోటు మాకు కనిపిస్తోంది. కానీ, టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అవ్వాలనేది వారి వ్యక్తిగత నిర్ణయం” అని ఆయన అన్నారు.

రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. బీసీసీఐకి ఒక స్పష్టమైన విధానం ఉందని, దాని ప్రకారం ఏ ఆటగాడికి ఎప్పుడు, ఏ ఫార్మాట్ నుండి రిటైర్ అవ్వాలని చెప్పదని అన్నారు. రిటైర్మెంట్ అనేది పూర్తిగా ఆటగాళ్లపై ఆధారపడి ఉంటుంది. టెస్ట్ ఫార్మాట్ నుండి తప్పుకోవాలనే నిర్ణయం కూడా ఈ ఇద్దరు ఆటగాళ్లే తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు.

విరాట్ కోహ్లీ వయసు ప్రస్తుతం 36 ఏళ్లు. కోహ్లీ తన కెరీర్‌లో 302 వన్డే మ్యాచ్‌లు ఆడి 14181 పరుగులు సాధించాడు. ఇందులో 51 సెంచరీలు, 74 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ గా కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించారు. అలాగే, కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు, 125 టీ20 మ్యాచ్‌లు ఆడి 4188 పరుగులు సాధించారు.

రోహిత్ శర్మ వయసు ప్రస్తుతం 37 ఏళ్లు. రోహిత్ శర్మ 273 వన్డే మ్యాచ్‌లు ఆడి 11168 పరుగులు సాధించాడు. ఇందులో 32 సెంచరీలు, 58 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డే క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) సాధించిన రికార్డు రోహిత్ పేరిట ఉంది. రోహిత్ 67 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 4301 పరుగులు, 159 టీ20 మ్యాచ్‌లు ఆడి 4231 పరుగులు చేశారు. రోహిత్ కెప్టెన్‌గా భారత జట్టుకు 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్‌ను అందించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..