
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కేవలం గ్రౌండ్‌లోనే కాదు, వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో క్రికెట్ గురించి కాకుండా One8 పేరుతో విడుదల చేసిన ప్రత్యేక ఫుట్‌వేర్ కలెక్షన్ గురించి కోహ్లీ ఉత్సాహంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఈ ఫుట్‌వేర్ లాంచ్ కేవలం కొత్త ఉత్పత్తి విడుదల మాత్రమే కాదు.. ప్రపంచ స్థాయి భారతీయ స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్‌ను నిర్మించాలన్న కోహ్లీ కలకు నాంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.
2017లో ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ సంస్థ పూమా విరాట్ కోహ్లీ సిగ్నేచర్ లైఫ్‌స్టైల్ బ్రాండ్‌గా వన్8ను ప్రారంభించింది. ఈ పేరు కోహ్లీ జెర్సీ నంబర్ 18తో పాటు, క్రమశిక్షణ, ఫిట్‌నెస్, స్వీయాభివృద్ధిని సూచించే అతని జీవన తత్వానికి ప్రతీకగా నిలిచింది. ప్రారంభంలో దుస్తులతో మొదలైన ఈ బ్రాండ్.. ప్రస్తుతం స్పోర్ట్స్‌వేర్, షూస్, యాక్సెసరీలు, బ్యాక్‌ప్యాక్‌లు, సుగంధ ద్రవ్యాలు వంటి అనేక లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను అందిస్తోంది.
పూమాతో కోహ్లీ భాగస్వామ్యం భారత క్రీడా రంగంలో అత్యంత విలువైన ఎండార్స్‌మెంట్ ఒప్పందాల్లో ఒకటిగా నిలిచింది. 2025లో ఒప్పంద పునరుద్ధరణ సందర్భంగా మరో ఎనిమిదేళ్లకు దాదాపు రూ.300 కోట్ల ఒప్పందాన్ని పూమా ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే కోహ్లీ ఆ ఆఫర్‌ను తిరస్కరించి, పూమా ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ గంగూలీ స్థాపించిన భారతీయ సంస్థ అజిలిటాస్ స్పోర్ట్స్‌తో చేతులు కలిపాడు.
కోహ్లీ అజిలిటాస్ స్పోర్ట్స్‌లో సుమారు రూ.40 కోట్లు పెట్టుబడి పెట్టి 1.94 శాతం వాటాను సొంతం చేసుకున్నాడు. దీంతో ఆయన కేవలం బ్రాండ్ ప్రచారకర్తగా కాకుండా.. సహ యజమాని, వ్యూహాత్మక భాగస్వామిగా మారాడు. వన్8 బ్రాండ్ హక్కులను కూడా అజిలిటాస్ సొంతం చేసుకోగా, ఉత్పత్తుల రూపకల్పన, నాణ్యత, బ్రాండింగ్, అంతర్జాతీయ విస్తరణ వంటి అంశాల్లో కోహ్లీ ప్రత్యక్షంగా పాల్గొంటున్నాడు.
కొత్త ఫుట్‌వేర్ శ్రేణి అభివృద్ధి సమయంలో కోహ్లీ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడలేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. తన ప్రమాణాలకు సరిపోకపోవడంతో ఏకంగా 17 నమూనాలను తిరస్కరించి, 18వ నమూనాకు మాత్రమే ఆమోదం తెలిపినట్లు సమాచారం. నేను ధరించని ఉత్పత్తిని వినియోగదారులు కొనాలని ఎలా ఆశించగలను అనే కోహ్లీ వ్యాఖ్య అతని నాణ్యతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది.
వన్8 తొలి ప్రత్యేక ఫుట్‌వేర్ కలెక్షన్‌లో పెర్ఫార్మెన్స్ రన్నింగ్ షూస్, ట్రైనింగ్ ఫుట్‌వేర్, క్రికెట్ స్పైక్స్, లైఫ్‌స్టైల్ స్నీకర్స్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచిన SEAM XVIII Signature Test Red షూ ధర రూ.9,230గా నిర్ణయించారు. కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో చేసిన 9,230 పరుగులకు గుర్తుగా ఈ ధరను నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఇటీవల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్‌తో పాటు పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా వన్8 క్రికెట్ స్పైక్స్ ధరించడం ఈ బ్రాండ్‌కు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చింది.
వన్8తో పాటు WROGN, చిసెల్ జిమ్స్, వన్8 కమ్యూన్, నుయెవా రెస్టారెంట్లు, డిజిట్ ఇన్సూరెన్స్, రేజ్ కాఫీ, బ్లూ ట్రైబ్, MPL వంటి అనేక వ్యాపారాల్లో కోహ్లీ పెట్టుబడులు పెట్టాడు. రోజర్ ఫెదరర్, మైఖేల్ జోర్డాన్, క్రిస్టియానో రొనాల్డో తరహాలో తన పేరును ప్రపంచ స్థాయి వ్యాపార బ్రాండ్‌గా మార్చాలన్న లక్ష్యంతో కోహ్లీ ముందుకు సాగుతున్నాడు. ‘Never Done’ అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగానే, క్రికెట్‌లో ఒక అధ్యాయం ముగింపుకు చేరువవుతున్న సమయంలో వ్యాపార రంగంలో కొత్త ఇన్నింగ్స్‌ను విజయవంతంగా ప్రారంభించినట్లు కనిపిస్తోంది.