
Temba Bavuma :గౌహతిలో జరుగుతున్న భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠగా మారింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేసింది. దానికి సమాధానంగా టీమిండియా కేవలం 201 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్, సౌతాఫ్రికా కంటే 288 పరుగుల భారీ లోటును ఎదుర్కొంది. సాధారణంగా 200 పరుగులకు పైగా ఆధిక్యం ఉంటే ప్రత్యర్థి జట్టుకు ఫాలో-ఆన్ విధిస్తారు. కానీ సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఆ అవకాశాన్ని వదులుకొని, మళ్లీ తామే బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. బవుమా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
సౌతాఫ్రికా ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం సీరీస్‌లో ఆధిక్యాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచనే. ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ రెండో మ్యాచ్ డ్రా అయినా సరే, సౌతాఫ్రికా సిరీస్‌ను గెలుచుకుంటుంది. అందుకే బవుమా సురక్షితమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.
సౌతాఫ్రికా జట్టు నాలుగో రోజు ఆట మూడో సెషన్ వరకు బ్యాటింగ్ చేసి, కనీసం మరో 250 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అప్పుడు వారి మొత్తం ఆధిక్యం 538 పరుగులు అవుతుంది. అంటే టీమిండియాకు చివరి ఇన్నింగ్స్‌లో 539 పరుగుల భారీ టార్గెట్ ఇవ్వాలనేది బవుమా వ్యూహం. 539 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం టెస్ట్ క్రికెట్‌లో దాదాపు అసాధ్యం. ఈ పెద్ద టార్గెట్ వల్ల టీమిండియా ముందు రెండు కష్టమైన ఆప్షన్లే మిగులుతాయి. చివరి రోజు మొత్తం వికెట్లు పడకుండా నిలబడి, మ్యాచ్‌ను డ్రా చేసుకోవడానికి ప్రయత్నించాలి లేదంటే రిస్క్ తీసుకుని లక్ష్యాన్ని ఛేదించడానికి ట్రై చేయాలి.
సౌతాఫ్రికా బౌలర్లు మొదటి ఇన్నింగ్స్‌లోనే భారత్‌ను 201 పరుగులకు ఆలౌట్ చేయగలిగారు. కాబట్టి, భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తే టీమ్ ఇండియా త్వరగా ఆలౌట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో సౌతాఫ్రికా ఈ మ్యాచ్ ఈజీగా గెలవవచ్చు లేదా డ్రాగా ముగియవచ్చు. ఈ లెక్కల కోసమే బవుమా ఫాలో-ఆన్ విధించలేదు. 288 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికా మొత్తం ఆధిక్యం 314 పరుగులకు చేరింది.
భారత్ ప్లేయింగ్ 11: కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ జురెల్, రిషభ్ పంత్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
సౌతాఫ్రికా ప్లేయింగ్ 11: ఐడెన్ మార్క్రామ్, రయాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జార్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెన్, మార్కో యాన్సెన్, సెనురాన్ ముత్తుసామి, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..