అజింక్య రహానె మా అగ్రశేణి ఆటగాళ్లలో ఒకడని అవసరమైనప్పుడల్లా జట్టుకు అండగా నిలబడతాడని కొనియాడాడు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో రోహిత్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో పలు విషయాలను వెల్లడించాడు. మొదటి రోజు మ్యాచ్‌లో అజింక్య రహానెతో నెలకొల్పిన భాగస్వామ్యం జట్టుకు ఎంతో ఉపకరించిందన్నాడు. టీమ్ఇండియాకు పరీక్షలు ఎదురైన ప్రతిసారీ పరుగులు చేసేందుకు అజింక్య రహానె ముందుకొస్తాడని కొనియాడాడు. అతడు క్లాస్ బ్యాట్స్‌మన్ అని ప్రశంసించాడు.
అతడు మా అగ్రశ్రేణి ఆటగాళ్లలో ఒకడని చాలాకాలంగా అతడు జట్టుకు ఎన్నో విలువైన ఇన్నింగ్సులు ఆడాడని గుర్తుచేశాడు. భోజన విరామానికి 3 వికెట్లు పడ్డాయి. అలాంటి సమయంలో మేం భాగస్వామ్యం నిర్మించడం అత్యంత కీలకం. జట్టుకు అవసరమైనప్పుడు అతడు పరుగులు చేయడం మేమెన్నో సార్లు చూశాం. అతడి ఫామ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటారో అర్థం కాదు. ఏదేమైనా మేం ఈరోజు పటిష్ఠ స్థితిలో ఉన్నామంటే అతడితో భాగస్వామ్యమే కారణమని రోహిత్ శర్మ చెప్పాడు. మా ఇద్దరికీ మా బ్యాటింగ్ శైలులపై అవగాహన ఉంది. నియంత్రణలో లేని గతం, భవిష్యత్తు గురించి నేను పట్టించుకోనని ఈ సందర్భంగా రోహిత్ పేర్కొన్నాడు.