Wasim Jaffer : హైదరాబాద్ క్రికెట్‌కు అసలోడు వచ్చిండు.. సరికొత్త బాధ్యతల్లో టీమిండియా మాజీ ఓపెనర్

Wasim Jaffer : భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రెండేళ్ల పాటు మెంటర్‌గా నియమించింది. సీనియర్, ఏజ్‌గ్రూప్ జట్లతో కలిసి పనిచేస్తూ యువ ఆటగాళ్ల అభివృద్ధి, దేశవాళీ టోర్నీల్లో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Wasim Jaffer : హైదరాబాద్ క్రికెట్‌కు అసలోడు వచ్చిండు.. సరికొత్త బాధ్యతల్లో టీమిండియా మాజీ ఓపెనర్
Wasim Jaffer

Edited By:

Updated on: Jul 04, 2026 | 9:15 AM

Wasim Jaffer : భారత మాజీ ఓపెనర్, దేశవాళీ క్రికెట్ దిగ్గజం వసీం జాఫర్ హైదరాబాద్ క్రికెట్‌కు కొత్త బాధ్యతలు చేపట్టారు. 2026-27 దేశవాళీ సీజన్‌కు ముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆయనను రెండేళ్ల కాలానికి మెంటర్‌గా నియమించింది. ఈ బాధ్యతల్లో భాగంగా సీనియర్ జట్టుతో పాటు వయోపరిమితి (ఏజ్‌గ్రూప్) జట్లకు కూడా జాఫర్ మెంటర్‌గా వ్యవహరించనున్నారు.

దేశవాళీ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరైన జాఫర్‌కు అపార అనుభవం ఉంది. ఆయన 10 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలవడంతో పాటు, రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గుర్తింపు పొందారు. యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలోనూ ఆయనకు మంచి పేరు ఉంది.

ఇటీవల హైదరాబాద్ క్రికెట్‌లో హెడ్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ బాధ్యతలు చేపట్టిన అంబటి రాయుడు సూచన మేరకే జాఫర్ నియామకం జరిగినట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో విజయవంతమైన అనుభవం ఉన్న భారతీయ కోచ్‌ను తీసుకురావాలనే ఆలోచనతో రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జాఫర్ అనుభవం, విజయాలు హైదరాబాద్ జట్టులో ‘విన్నింగ్ మైండ్‌సెట్’ తీసుకురావడంలో కీలకంగా ఉపయోగపడతాయని హెచ్‌సీఏ భావిస్తోంది.

2020లో అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత జాఫర్ పలు జట్లకు కోచ్‌, మెంటర్‌గా సేవలందించారు. ముఖ్యంగా విదర్భ, ఉత్తరాఖండ్, ఒడిశా, పంజాబ్ జట్లతో పనిచేశారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు కన్సల్టెంట్ బ్యాటింగ్ కోచ్‌గా, అలాగే ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్‌గా కూడా సేవలందించారు.

2025-26 రంజీ ట్రోఫీ సీజన్‌లో హైదరాబాద్ జట్టు ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క పూర్తి విజయాన్ని నమోదు చేసి తమ గ్రూపులో నాలుగో స్థానంలో నిలిచింది. విజయ్ హజారే ట్రోఫీలోనూ గ్రూప్ దశను దాటలేకపోయింది. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో మాత్రం మంచి ప్రదర్శన కనబరిచి, నెట్ రన్‌రేట్ కారణంగా మాత్రమే ఫైనల్ అవకాశాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో జాఫర్ వంటి ఎక్స్‌పీరియన్స్ ట్రైనింగ్‌లో హైదరాబాద్ జట్టు దేశవాళీ టోర్నీల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని హెచ్‌సీఏ లక్ష్యంగా పెట్టుకుంది.

అంబటి రాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ క్రికెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ టీ20 లీగ్ నిర్వహణకు అనుమతులు ఇవ్వడంతో పాటు, హైదరాబాద్ క్రికెట్ పరిధిలోని జిల్లాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా హెచ్‌సీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వసీం జాఫర్ రాకతో హైదరాబాద్ క్రికెట్‌లో కొత్త ఉత్సాహం నెలకొంటుందని, యువ ఆటగాళ్లకు ఆయన అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us