
Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్ పోరులో ఒక కొత్త స్టార్ ఉదయించాడు. అతనే సౌరాష్ట్ర బ్యాటర్ విశ్వరాజ్ జడేజా. పంజాబ్‌తో జరిగిన చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో జడేజా ఆడిన ఇన్నింగ్స్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఏకంగా 292 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ఒంటరి పోరాటం చేసి, తన జట్టును దర్జాగా ఫైనల్‌కు చేర్చాడు. పంజాబ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఆయన బాదిన సెంచరీ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పంజాబ్ నిర్దేశించిన 292 పరుగుల టార్గెట్‌ను చూసి సౌరాష్ట్ర కష్టాల్లో పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఓపెనర్‌గా వచ్చిన విశ్వరాజ్ జడేజా ఆలోచనలు వేరేలా ఉన్నాయి. కెప్టెన్ హార్విక్ దేశాయ్‌తో కలిసి మొదటి వికెట్‌కు ఏకంగా 172 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కెప్టెన్ అవుట్ అయినా జడేజా ఏమాత్రం తగ్గలేదు. ప్రేరక్ మన్కడ్‌తో కలిసి మరో సెంచరీ పార్టనర్‌షిప్‌తో పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు. కేవలం 127 బంతుల్లోనే 18 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో నాకౌట్ 165 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 129 స్ట్రైక్ రేట్‌తో ఆయన ఆడిన తీరు చూస్తుంటే.. త్వరలో ఐపీఎల్ లేదా టీమ్ ఇండియా తలుపు తట్టడం ఖాయమనిపిస్తోంది.
ఈ ఇన్నింగ్స్‌లో జడేజాకు ఒక చిన్న అదృష్టం కూడా తోడైంది. 120 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంజాబ్ ఫీల్డర్ ఒక సులువైన క్యాచ్‌ను జారవిడిచాడు. ఆ తర్వాత విశ్వరాజ్ వెనక్కి తిరిగి చూడలేదు. పంజాబ్ బౌలర్లు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఏ బంతిని ఎక్కడ వేయాలో తెలిసినట్లుగా జడేజా విరుచుకుపడ్డాడు. తప్పుడు షాట్లకు పోకుండా, క్లాసిక్ క్రికెటింగ్ షాట్లతో పరుగుల వరద పారించాడు. ఈ విజయంతో సౌరాష్ట్ర 2022-23 సీజన్ తర్వాత మళ్ళీ ఫైనల్లో అడుగుపెట్టింది.
విశ్వరాజ్ జడేజా ఈ ఒక్క మ్యాచ్‌తోనే మెరిసిన ఆటగాడు కాదు. ఈ సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో ఆయన ఫామ్ భీభత్సంగా ఉంది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 67 సగటుతో 500 కి పైగా పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉండటం విశేషం. గుజరాత్, ఢిల్లీ వంటి బలమైన జట్లపై కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. జనవరి 18న జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో విదర్భతో సౌరాష్ట్ర తలపడనుంది. ఇదే జోరును ఫైనల్లోనూ కొనసాగించి జట్టుకు కప్పు అందించాలని జడేజా కసిగా ఉన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..