
Virat Kohli Warning RCB Players: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ నెల 28 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ ఘనంగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లోనే చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. గత ఏడాది టైటిల్ విజేతగా నిలిచిన ఆర్‌సీబీ, ఈసారి కూడా కప్పును నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది.
రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్‌సీబీ జట్టు తాజాగా చిన్నస్వామి స్టేడియంలో తమ మొదటి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆటగాళ్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. “గత రెండు మూడు సీజన్లలో మనం పడ్డ కష్టానికి ఫలితం గత ఏడాదే దక్కింది. కానీ ఈసారి సవాళ్లు ఇంకా కఠినంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే మిగతా జట్లన్నీ డిఫెండింగ్ ఛాంపియన్‌ను ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాయి” అని కోహ్లీ హెచ్చరించాడు.
ప్రాక్టీస్ సమయంలో ఎవరూ సమయాన్ని వృధా చేయకూడదని కోహ్లీ సూచించాడు. ప్రతి సెషన్‌లోనూ 120 శాతం కష్టపడాలని, తొలి మ్యాచ్ నుంచే విజయాల పరంపరను కొనసాగించాలని కోరాడు. ఆటగాళ్ల ముఖాల్లో కనిపిస్తున్న ఉత్సాహం టోర్నీ అంతా కొనసాగాలని ఆకాంక్షించాడు. ముఖ్యంగా మైదానంలో నిబద్ధతతో ఉంటేనే ఫలితాలు అనుకూలంగా వస్తాయని ఆయన స్పష్టం చేశాడు.
గత సీజన్‌లో ఆర్‌సీబీ తొలిసారి టైటిల్ గెలవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. మొత్తం 15 మ్యాచుల్లో 657 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఏడాది కూడా కోహ్లీ ఫామ్ ఆర్‌సీబీకి అత్యంత కీలకం కానుంది. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో, కోహ్లీ అనుభవంతో ఆర్‌సీబీ మరోసారి చరిత్ర సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..