Virat Kohli : కోహ్లీ ఫామ్‌లోకి రావాలంటే మరికొన్ని మ్యాచ్‌లు ఆడాల్సిందే.. మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Virat Kohli : ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో విరాట్ కోహ్లీ వైఫల్యంపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఆడుతున్న కోహ్లీ పూర్తిస్థాయి ఫామ్ అందుకోవాలంటే మరికొన్ని మ్యాచ్‌లు అవసరమని అభిప్రాయపడ్డాడు. త్వరలోనే అతను తన ట్రేడ్‌మార్క్ షాట్లతో మళ్లీ పరుగుల వర్షం కురిపిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.

Virat Kohli : కోహ్లీ ఫామ్‌లోకి రావాలంటే మరికొన్ని మ్యాచ్‌లు ఆడాల్సిందే.. మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Virat Kohli

Updated on: Jul 15, 2026 | 7:55 PM

Virat Kohli : ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించినప్పటికీ ఇద్దరు దిగ్గజ బ్యాటర్ల ప్రదర్శన మాత్రం నిరాశపరిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు తక్కువ పరుగులకే అవుట్ కావడం హాట్ టాపిక్‌గా మారింది. 37 ఏళ్ల రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో కేవలం 6 బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క ఫోర్‌తో 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో కోహ్లీని జోఫ్రా ఆర్చర్ అవుట్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

టెస్టులు, టీ20 ఫార్మాట్‌లకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం భారత్ తరఫున కేవలం వన్డే మ్యాచ్‌లే ఆడుతున్నాడు. దీనివల్ల అతనికి మ్యాచ్‌ల మధ్య చాలా ఎక్కువ గ్యాప్ వస్తోంది. దీనికి తోడు గాయం కారణంగా ఇటీవల జరిగిన ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు కూడా కోహ్లీ దూరమయ్యాడు. దీంతో దాదాపు 6 నెలల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ సుదీర్ఘ గ్యాప్ వల్లే కోహ్లీ ఇబ్బంది పడ్డాడని మాజీ భారత ఆటగాడు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. సోనీ స్పోర్ట్స్ చర్చా కార్యక్రమంలో రాయుడు మాట్లాడుతూ.. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు లేదా ఎక్స్‌ట్రా పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొంటున్నప్పుడు బ్యాటర్ల దృష్టి ఎక్కువగా లెంగ్త్ బంతులపైనే ఉంటుందని, అందుకే ఒక్కోసారి నేరుగా వచ్చే ఫుల్ లెంగ్త్ బాల్స్‌ను అంచనా వేయడంలో పొరపాట్లు జరుగుతాయని విశ్లేషించాడు.

విరాట్ కోహ్లీ తిరిగి తన మునుపటి లయను అందుకోవడానికి మరికొంత సమయం పడుతుందని రాయుడు వెల్లడించాడు. “కోహ్లీ మైదానంలో మరింత సమయం గడుపుతూ, మరికొన్ని మ్యాచ్‌లు ఆడితే చాలు.. ఇలాంటి స్ట్రెయిట్ బాల్స్‌ను సునాయాసంగా మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలిస్తాడు. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ కొట్టినట్లే, కోహ్లీ కూడా త్వరలోనే తన ట్రేడ్‌మార్క్ షాట్లతో మైదానాన్ని హోరెత్తిస్తాడు” అని రాయుడు ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో 259 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ గిల్ 80 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

మరోవైపు టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఆటతీరుపై స్పందించాడు. రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో 21 బంతుల్లో ఒకే ఒక్క ఫోర్‌తో 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. రోహిత్ అవుట్ అయిన తీరుపై శార్దూల్ పెదవి విరిచాడు. “రోహిత్ శర్మ చాలా రోజుల తర్వాత ఆడుతున్నాడు. అవతలి ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ చాలా చక్కగా పరుగులు రాబడుతున్నాడు. అలాంటప్పుడు రోహిత్ అంత తొందరపడి ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. క్రీజులో మరికొంత సమయం గడిపి పిచ్‌ను అర్థం చేసుకుని ఉంటే బాగుండేది” అని శార్దూల్ విశ్లేషించాడు.

కోహ్లీ అవుట్ అయిన బంతి గురించి శార్దూల్ ఠాకూర్ వివరిస్తూ.. “జోఫ్రా ఆర్చర్ అంతకుముందు బంతులన్నింటినీ బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్‌గా వేశాడు. మధ్యలో కొన్ని బౌన్సర్లు కూడా సంధించాడు. ఆ వేగానికి సిద్ధమైన కోహ్లీని ఆర్చర్ ఒక అద్భుతమైన స్ట్రెయిట్ ఫుల్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. ఆ బంతిని అంచనా వేయడంలో కోహ్లీ గాల్లోకి బ్యాట్ తిప్పి మిస్ అయ్యాడు” అని పేర్కొన్నాడు. సీనియర్ల ప్రదర్శన ఎలా ఉన్నా, మిగిలిన బ్యాటర్లు రాణించి భారత్‌కు ఘనవిజయాన్ని అందించడం విశేషం.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us