బుడ్డోడు మళ్లీ బరిలోకి దిగే టైమ్ వచ్చేసింది..! మ్యాచ్ డేట్, లైవ్ ఎక్కడ చూడాలి? పూర్తి వివరాలు ఇవే..

ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో దారుణమైన ఫలితాల తర్వాత టీమ్ ఇండియా జింబాబ్వేలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. జూలై 23 నుంచి హరారేలో జరిగే ఈ సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, మ్యాచ్‌ల షెడ్యూల్, భారత జట్టు, ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే.

బుడ్డోడు మళ్లీ బరిలోకి దిగే టైమ్ వచ్చేసింది..! మ్యాచ్ డేట్, లైవ్ ఎక్కడ చూడాలి? పూర్తి వివరాలు ఇవే..
Vaibhav

Updated on: Jul 21, 2026 | 4:48 PM

ఇటీవలె భారీ అంచనాల మధ్య ఇంగ్లాండ్‌పై మూడు టీ20లు ఆడిన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ మరోసారి అంతర్జాతీయ పరీక్షను ఎదుర్కొనున్నాడు. ఇంగ్లాండ్‌పై విఫలమైన వైభవ్.. జింబాబ్వేపై ఎలాగైనా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికీ అతనిపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. పైగా జింబాబ్వే సిరీస్‌కు సంజు శాంసన్‌ను పక్కనపెట్టడంతో అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి వైభవ్ ఆడబోయే మ్యాచ్‌ల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20ల్లో ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లో వరుస పరాజయాలతో నిరాశ చెందిన టీమిండియా ఇప్పుడు కొత్త సవాల్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్ కోసం భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన మూడు రోజుల వ్యవధిలోనే భారత్ తదుపరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుండటం విశేషం. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఈ నెల 23 నుంచి హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు కూడా అదే వేదికపై జరగనున్నాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని యువ భారత జట్టు ఈ సిరీస్‌లో విజయాలతో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇంగ్లాండ్ పర్యటనలో పాల్గొన్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు పలువురు ఆటగాళ్లు నేరుగా హరారేకు చేరుకోగా, మిగతా సభ్యులు తాత్కాలిక ప్రధాన కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో భారత్ నుంచి జింబాబ్వేకు వెళ్లారు. ఈ సిరీస్‌లో తొలి టీ20 జూలై 23న హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానుంది. రెండో టీ20 జూలై 25న, మూడో టీ20 జూలై 26న అదే గ్రౌండ్‌లో సేమ్ టైమ్‌కి ప్రారంభం కానుంది.

భారత జట్టు..

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్జ్, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).

లైవ్ ఎక్కడ చూడాలి?

భారత్-జింబాబ్వే టీ20 సిరీస్‌కు టీవీ ప్రసారం ఉండదు. స్టార్ స్పోర్ట్స్, సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లలో ఈ మ్యాచ్‌లు ప్రసారం కావు. అలాగే జియోహాట్‌స్టార్ లేదా సోనీ LIVలో కూడా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండదు. అభిమానులు ఈ మూడు మ్యాచ్‌లను ఫ్యాన్‌కోడ్ (FanCode) ప్లాట్‌ఫామ్‌లో లైవ్ చూడొచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us