Vaibhav Sooryavanshi: వైభవ్ సూరవంశీ టెస్ట్ క్రికెట్‌లో రాణించలేడా? బుడ్డోడి టెక్నిక్‌పై దిగ్గజాల మధ్య వార్

Vaibhav Sooryavanshi: కేవలం పదిహేనేళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచాన్ని తన బ్యాటింగ్‌తో అలరిస్తున్న వైభవ్ సూరవంశీ టెస్ట్ ఫార్మాట్‌లో రాణించగలడా లేదా అనే అంశంపై పెద్ద చర్చే నడుస్తోంది. ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ ఆయన టెక్నిక్‌ను తప్పుపట్టగా, ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం మాత్రం యువ క్రికెటర్‌కు పూర్తిగా మద్దతుగా నిలిచారు.

Vaibhav Sooryavanshi: వైభవ్ సూరవంశీ టెస్ట్ క్రికెట్‌లో రాణించలేడా? బుడ్డోడి టెక్నిక్‌పై దిగ్గజాల మధ్య వార్
Vaibhav Sooryavanshi

Updated on: Sep 20, 2026 | 7:08 PM

Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూరవంశీ చుట్టూ ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అతి చిన్న వయసులోనే అరంగేట్రం చేసిన ఈ కుర్రాడి భవిష్యత్తుపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మోంటి పనేసర్ ఇటీవల ఒక పాడ్ కాస్ట్‎లో మాట్లాడుతూ వైభవ్ టెస్ట్ క్రికెట్‌కు సరిపోడని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం టీ20లలో మాత్రమే చెలరేగే ఆటగాళ్లు రెడ్ బాల్ ఫార్మాట్‌లో ఇబ్బంది పడతారని వైభవ్ టెక్నిక్‌లో కొన్ని లోపాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మైఖేల్ క్లార్క్ స్ట్రాంగ్ కౌంటర్

పనేసర్ చేసిన వ్యాఖ్యలను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ తీవ్రంగా ఖండించారు. విరాట్ కోహ్లీ అలాగే ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలు అన్ని ఫార్మాట్లలోనూ ఒకేలా రాణించి ప్రపంచానికి నిరూపించారని క్లార్క్ గుర్తుచేశారు. వైభవ్ లాంటి యంగ్ టాలెంట్స్ సరైన మార్గదర్శకత్వంలో తమ ఆటను టెస్ట్ ఫార్మాట్‌కు తగినట్లు మలచుకోగలరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం ప్రారంభ అంచనాల ఆధారంగా ఒక యువ ఆటగాడి సామర్థ్యాన్ని తక్కువ చేసి అంచనా వేయకూడదని క్లార్క్ గట్టిగా స్పష్టం చేశారు.

వైట్ బాల్ వర్సెస్ రెడ్ బాల్ గణాంకాలు

వైభవ్ సూరవంశీకి సంబంధించిన వైట్ బాల్ అలాగే రెడ్ బాల్ గణాంకాలను పరిశీలిస్తే గణనీయమైన తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్ టీ20 క్రికెట్‌లో అద్భుతమైన సగటు అలాగే అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌తో పరుగుల వరద పారించిన ఈ యువ ఆటగాడు, రెడ్ బాల్ క్రికెట్‌లో కాస్త నెమ్మదిగా రాణిస్తున్నాడు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో అండర్-ఏజ్ రికార్డు నమోదు చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. సెంచరీకి చేరువగా వచ్చి చేసిన ఆ కీలక ఇన్నింగ్స్ ఆయనలోని టెస్ట్ టెంపరేమెంట్‌ను కూడా కొంతవరకు చాటిచెప్పింది.

ఏషియన్ గేమ్స్ వైపు అడుగులు

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైభవ్ సూరవంశీ తన దృష్టిని ఆసియా క్రీడలపై నిలిపాడు. జపాన్ గడ్డపై జరగనున్న ఈ మహా వేడుకలకు బయలుదేరుతున్న భారత జట్టులో అత్యంత పిన్న వయసుగల అథ్లెట్‌గా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందాడు. దేశం తరఫున ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో అడుగుపెడుతున్న ఈ తరుణంలో విమర్శలను పక్కన పెట్టి తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలని వైభవ్ భావిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఈ కుర్రాడు రెడ్ బాల్ క్రికెట్‌లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనే ఉత్కంఠ క్రీడాభిమానులలో నెలకొంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us