
IND A vs BAN A : రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025లో తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠకు పరాకాష్టగా నిలిచింది. ఈ మ్యాచ్‌ను ఒక సాధారణ క్రికెట్ మ్యాచ్ అని కాకుండా ట్విస్టులు, ఉత్కంఠ, చివరికి ఊహించని ఫలితం ఇచ్చిన డ్రామా సినిమా అని చెప్పవచ్చు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 194 పరుగులు చేయగా, దానికి సమాధానంగా టీమిండియా A కూడా సరిగ్గా 194 పరుగులే చేసి మ్యాచ్‌ను టై చేసింది. అయితే, సూపర్ ఓవర్ లో మాత్రం భారత్‌కు దారుణ అనుభవం ఎదురైంది. ఆఖరికి ఒకే ఒక్క వైడ్ బాల్ కారణంగా బంగ్లాదేశ్ అద్భుత విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఈ ఓటమితో టోర్నమెంట్‌లో భారత్ ప్రయాణం ముగిసింది.
195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత్ A జట్టుకు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్య మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 38 రన్స్), ప్రియాన్ష్ ఆర్య (23 బంతుల్లో 44 రన్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో దూసుకుపోయారు. ఆ తర్వాత కెప్టెన్ జితేష్ శర్మ కూడా 23 బంతుల్లో 33 పరుగులు చేసి పోరాడాడు.చివరి 6 బంతుల్లో భారత్‌కు గెలవడానికి 16 పరుగులు అవసరం కాగా, అశుతోష్ మూడవ బంతికి సిక్సర్, నాలుగో బంతికి ఫోర్ కొట్టి ఉత్కంఠను పెంచాడు. ఆఖరి బంతికి హర్ష్ దూబే 3 పరుగులు తీయడంలో విజయం సాధించడంతో స్కోరు 194 పరుగుల వద్ద నిలిచి మ్యాచ్ టై అయింది.
మ్యాచ్ టై అవ్వడంతో విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ అనివార్యమైంది. అయితే ఈ చిన్న పోరాటంలో భారత జట్టు దారుణంగా విఫలమైంది. సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ A జట్టు తరఫున కెప్టెన్ జితేష్ శర్మ, ఆశుతోష్ శర్మ కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండానే తొలి రెండు బంతులకే ఔట్ అయ్యారు. దీంతో భారత ఇన్నింగ్స్ సున్నా పరుగులకే ముగిసింది.
కేవలం ఒకే ఒక్క పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కూడా సూపర్ ఓవర్ లో తొలి బంతికే యాసిర్ అలీ వికెట్ కోల్పోయింది. అయితే, అదృష్టం బంగ్లాదేశ్ వైపు ఉండటంతో భారత బౌలర్ వేసిన రెండో బంతి వైడ్ అంపైర్ ప్రకటించారు. దీంతో వైడ్ ద్వారా వచ్చిన ఆ ఒక్క పరుగుతో బంగ్లాదేశ్ A జట్టు ఉత్కంఠభరితమైన ఈ సెమీ-ఫైనల్‌లో విజయం సాధించి నేరుగా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. గుర్జప్నీత్ సింగ్ 2 వికెట్లు తీసినా వైభవ్ సూర్యవంశీ (38), ప్రియాన్ష్ ఆర్య (44), జితేష్ (33) బాగా ఆడినా చివరికి సూపర్ ఓవర్‌లో వైడ్ బాల్ రూపంలో వచ్చిన అదృష్టం బంగ్లాదేశ్‌ను గెలిపించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..