
Tilak Varma : టీమిండియా యువ సంచలనం, తెలుగు తేజం నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌కు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే, ఈ స్టార్ క్రికెటర్‌ను తీర్చిదిద్దిన ఘనత ఆయన కోచ్ సలాం బయాష్ దక్కుతుంది. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ కోచ్ సలాం బయాష్ గురువారం నాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి శివధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో కోచ్ సలాం బయాష్, తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన, అలాగే తన ప్రయాణం గురించి మాట్లాడారు.
లింగంపల్లికి చెందిన తిలక్ వర్మకు తాను 12 సంవత్సరాల వయసు నుంచే క్రికెట్ నేర్పిస్తున్నట్లు, స్థానికంగా ఉన్న లేగాలా క్రికెట్ అకాడమీలో శిక్షణ ఇచ్చినట్లు కోచ్ సలాం బయాష్ డీజీపీకి వివరించారు. యువ పోలీసు సిబ్బందికి క్రికెట్‌లో ట్రైనింగ్ ఇవ్వమని డీజీపీ బి శివధర్ రెడ్డి తనకు సూచించినట్లు కోచ్ సలాం తెలిపారు. ఈ సమావేశంలో ఐజీపీ స్పోర్ట్స్ శ్రీ ఎం. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌కు చెందిన నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తిలక్ వర్మ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. అతని తండ్రి నంబూరి నాగరాజు ఒక సాధారణ ఎలక్ట్రీషియన్. కుటుంబాన్ని పోషించడానికి ఆయన చాలా కష్టపడేవారు. చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఇష్టపడే తిలక్ వర్మను 11 ఏళ్ల వయసులో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతుండగా కోచ్ సలాం బయాష్ చూశారు. తిలక్‌లో ఉన్న అద్భుతమైన ప్రతిభను గుర్తించిన సలాం, తిలక్ తండ్రి నాగరాజును కలిసి, తన కొడుకుకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.
క్రికెట్ కోచింగ్‌కు అయ్యే ఖర్చులను భరించే స్థోమత లేదని నాగరాజు చెప్పినా, కోచ్ సలాం బయాష్ స్వయంగా ఆ బాధ్యతను తీసుకున్నారు. సలాం బయాష్ స్వంత ఖర్చులతో తిలక్‌ను తాను కోచ్‌గా పనిచేస్తున్న క్రికెట్ అకాడమీలో చేర్చారు. అంతేకాకుండా, తిలక్ అవసరమైన క్రికెట్ కిట్, ఇతర పరికరాల ఖర్చులను కూడా సలామే భరించారు.
11 ఏళ్ల వయసు నుంచి సలాం బయాష్, తిలక్‌కు గురువుగా, మార్గదర్శిగా ఉండి, మంచి బ్యాట్స్‌మెన్‌గా తీర్చిదిద్దారు. తిలక్ మంచిగా ఆడుతున్నాడని తెలుసుకున్న నాగరాజు కూడా, తన కొడుకు ఇతర అవసరాల కోసం మరింత కష్టపడ్డాడు. కోచ్ సలాం, తండ్రి నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ, ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో తన సత్తా చాటి హైదరాబాద్ రంజీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. తిలక్ టాలెంటును గుర్తించిన ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ వేలంలో అతన్ని కొనుగోలు చేసింది. ముంబై జట్టులో స్థానం దొరకడంతో తిలక్ ఆర్థిక సమస్యలు తీరాయి.
ఐపీఎల్‌లో తిలక్ అద్భుత ప్రదర్శన కారణంగా 2023లో భారత అంతర్జాతీయ టీ20 జట్టుకు పిలుపు అందింది. ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్‌పై ఒత్తిడిలో అద్భుతంగా ఆడి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో తిలక్ వర్మ ఇతర ఫార్మాట్‌లలోకి కూడా ప్రవేశించే అవకాశం ఉంది. కోచ్ సలాం బలాన్ని, మార్గదర్శకత్వాన్ని అందుకున్న తిలక్ వర్మ నేడు దేశానికి సూపర్ స్టార్‌గా మారాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..