
Thami Tsolekile Story: చిన్న వయసులోనే స్కూల్ క్రికెట్‌లో రికార్డుల మోత.. సౌతాఫ్రికా తరపున టెస్టు అరంగేట్రం.. హాకీలోనూ దేశానికి ప్రాతినిధ్యం.. దేశవాళీ క్రికెట్‌లో వేల పరుగులు..! ఇంతటి అద్భుతమైన ప్రయాణం సాగించిన థామి సోలెకిలే కెరీర్ మాత్రం చివరికి ఊహించని మలుపు తిరిగింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించిన కేసులో దోషిగా తేలడంతో ఏకంగా 12 ఏళ్ల నిషేధం ఎదురైంది.
సౌతాఫ్రికా మాజీ వికెట్‌కీపర్ థామి సోలెకిలే (Thami Tsolekile) క్రికెట్ ప్రయాణం సాధారణ కథ కాదు. కేప్‌టౌన్‌లోని లంగా టౌన్‌షిప్లో పెరిగిన సోలెకిలే చిన్నతనంలో ఫుట్‌బాల్‌లోనూ ప్రతిభ చూపించాడు. స్నేహితులు అతడిని ‘మారా’ అని పిలిచేవారు. అయితే పిన్‌లాండ్స్ స్కూల్‌లో లభించిన స్కాలర్‌షిప్ అతడి జీవితాన్ని మార్చేసింది. అక్కడ అడుగుపెట్టిన వెంటనే బ్యాటింగ్, వికెట్‌కీపింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
స్కూల్ క్రికెట్‌లో కేప్‌టౌన్‌కు సంబంధించిన దాదాపు అన్ని ప్రధాన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వాటిలో కొన్ని రికార్డులు సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ జాక్వెస్ కలిస్ (Jacques Kallis) పేరిట ఉండేవి.
ఎక్కువమంది చదివినది: ఇక లాభం లేదురా బుడ్డోడా.. టీమిండియాలో చోటు కోసం జైస్వాల్ కీలక నిర్ణయం..!
థామి సోలెకిలే ప్రతిభ క్రికెట్‌కే పరిమితం కాలేదు. హాకీలోనూ అద్భుతంగా రాణించిన అతడు సౌతాఫ్రికా సీనియర్ హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ అరంగేట్రంలోనే గోల్ సాధించాడు. అయితే చివరికి క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నాడు. అదే నిర్ణయం అతడిని సౌతాఫ్రికా టెస్టు జట్టు వరకు తీసుకెళ్లింది.
2000లో కేవలం 19 ఏళ్ల వయసులోనే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు సోలెకిలే. తర్వాతి ఏడాదే సౌతాఫ్రికా అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వికెట్ల వెనుక అతడి నైపుణ్యం, బ్యాటింగ్‌లో చూపించిన స్థిరత్వం సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాయి. 2003లో సౌతాఫ్రికా-ఏ జట్టుతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. అక్కడి ప్రదర్శనతో సీనియర్ జట్టుకు తాను సిద్ధంగా ఉన్నానని నిరూపించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటన కోసం సౌతాఫ్రికా టెస్టు జట్టులో చోటు దక్కింది.
సోలెకిలే కెరీర్‌లో అత్యంత గుర్తుండిపోయే ఘట్టం 2004లో భారత్‌పై టెస్టు అరంగేట్రం. అప్పట్లో మార్క్ బౌచర్ జట్టుకు దూరం కావడంతో వికెట్‌కీపింగ్ బాధ్యతలు సోలెకిలేకు వచ్చాయి. అలా భారత జట్టుపై టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అయితే అంతర్జాతీయ స్థాయిలో బ్యాట్‌తో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. సౌతాఫ్రికా తరపున మొత్తం మూడు టెస్టులు ఆడి 47 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో త్వరగానే జట్టుకు దూరమయ్యాడు.
ఎక్కువమంది చదివినది: నెట్స్‌లో బుడ్డోడి ఊచకోత.. తుది జట్టులోకి చోటు కోసం గట్టిగానే ఇచ్చిపడేశాడుగా..?
అంతర్జాతీయ జట్టుకు దూరమైనా సోలెకిలే వెనక్కి తగ్గలేదు. దేశవాళీ క్రికెట్‌లో మళ్లీ తనను తాను నిరూపించుకున్నాడు. 2009లో లయన్స్ (Lions) జట్టుతో చేరిన తర్వాత నిలకడగా రాణించాడు. అతడి ప్రదర్శనకు గుర్తింపుగా సౌతాఫ్రికా-ఏ జట్టులో చోటు దక్కింది. అక్కడ కెప్టెన్సీ బాధ్యత కూడా అందుకున్నాడు. 2012లో మార్క్ బౌచర్ కంటికి తీవ్రమైన గాయం కావడంతో సౌతాఫ్రికా టెస్టు జట్టులో బ్యాకప్ వికెట్‌కీపర్‌గా సోలెకిలేకు మరోసారి అవకాశం వచ్చింది. ఇది అతడికి కెరీర్‌ను పునర్నిర్మించుకునే గొప్ప ఛాన్స్. కానీ ఈసారి కూడా టెస్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. ఆ తర్వాత అతడి అంతర్జాతీయ కెరీర్ దాదాపుగా ముగిసిపోయింది.
సోలెకిలే కెరీర్‌లో అత్యంత చీకటి అధ్యాయం 2016లో మొదలైంది. క్రికెట్ సౌతాఫ్రికా నిర్వహించిన దర్యాప్తులో.. 2015 రామ్ స్లామ్ టీ20 ఛాలెంజ్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించిన కుట్రలో పాల్గొన్నట్టు అతడిపై ఆరోపణలు రుజువయ్యాయి. అంతేకాదు, మ్యాచ్‌ను ప్రభావితం చేసేందుకు తనను సంప్రదించిన విషయాన్ని పూర్తిగా వెల్లడించలేదన్న ఆరోపణ కూడా అతడిపై ఉంది. ఈ కేసులో దోషిగా తేలడంతో క్రికెట్ సౌతాఫ్రికా అతడిపై ఏకంగా 12 ఏళ్ల నిషేధం విధించింది. అంతే.. అప్పటివరకు సాగిన సుదీర్ఘ క్రికెట్ ప్రయాణానికి ఒక్కసారిగా బ్రేక్ పడింది.
అంతర్జాతీయ స్థాయిలో కేవలం మూడు టెస్టులే ఆడినా.. సోలెకిలే దేశవాళీ కెరీర్ మాత్రం చాలా ప్రభావవంతంగా సాగింది. వెస్ట్రన్ ప్రావిన్స్, కేప్ కోబ్రాస్, లయన్స్ వంటి ప్రముఖ జట్లకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. అతడి గణాంకాలు చూస్తే దేశవాళీ స్థాయిలో ఎంత స్థిరమైన ఆటగాడో అర్థమవుతుంది.
థామి సోలెకిలే కథలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఇదే. స్కూల్ క్రికెట్‌లో రికార్డులు.. జాతీయ స్థాయిలో టెస్టు అరంగేట్రం.. హాకీలోనూ దేశానికి ప్రాతినిధ్యం.. దేశవాళీ క్రికెట్‌లో సుదీర్ఘ కెరీర్.. మళ్లీ జాతీయ జట్టుకు చేరే ప్రయత్నం.. ఇన్ని మలుపుల తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం అతడి కెరీర్‌కు ఊహించని ముగింపు తీసుకొచ్చింది. అతడిని సౌతాఫ్రికా టెస్టు క్రికెట్‌లో ఆడిన తొలి నల్లజాతి ఆఫ్రికన్ స్పెషలిస్ట్ వికెట్‌కీపర్‌గా కూడా గుర్తు చేసుకుంటారు.
థామి సోలెకిలే కథలో ప్రతిభకు కొదవ లేదు. అవకాశాలు వచ్చాయి.. కొన్ని కోల్పోయాడు.. మళ్లీ పుంజుకున్నాడు.. దేశవాళీ క్రికెట్‌లో తన ముద్ర వేశాడు. భారత్‌పై టెస్టు అరంగేట్రం అతడి కెరీర్‌లో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. కానీ 2016లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించిన కేసులో 12 ఏళ్ల నిషేధం అతడి క్రికెట్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక ఆటగాడి కెరీర్‌ను ప్రతిభ ఎంత ఎత్తుకు తీసుకెళ్లగలదో, వివాదాలు అదే ప్రయాణాన్ని ఎంత వేగంగా మార్చగలవో సోలెకిలే కథ స్పష్టంగా చెబుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..