Shubman Gill : పాపం శుభ్‌మన్ గిల్.. గ్రౌండ్‌లోకి వస్తాడనుకుంటే బెడ్ ఎక్కాడు.. నీ టైం బాలేదు బాసూ

Shubman Gill : టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. గాయం నుంచి కోలుకుని మైదానంలోకి అడుగుపెడతారనుకున్న తరుణంలో గిల్ మరోసారి అనారోగ్యం బారిన పడ్డారు. విజయ్ హజారే ట్రోఫీ ద్వారా ఫామ్‌లోకి రావాలని భావించిన గిల్‌కు ఫుడ్ పాయిజనింగ్ శాపంగా మారింది.

Shubman Gill : పాపం శుభ్‌మన్ గిల్.. గ్రౌండ్‌లోకి వస్తాడనుకుంటే బెడ్ ఎక్కాడు.. నీ టైం బాలేదు బాసూ
Shubman Gill Retired Hurt

Updated on: Jan 03, 2026 | 2:40 PM

Shubman Gill : టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. గాయం నుంచి కోలుకుని మైదానంలోకి అడుగుపెడతారనుకున్న తరుణంలో గిల్ మరోసారి అనారోగ్యం బారిన పడ్డారు. విజయ్ హజారే ట్రోఫీ ద్వారా ఫామ్‌లోకి రావాలని భావించిన గిల్‌కు ఫుడ్ పాయిజనింగ్ శాపంగా మారింది. శనివారం సిక్కింతో జరగాల్సిన మ్యాచ్‌కు ముందు భోజనం వికటించడంతో ఆయన జట్టుకు దూరమయ్యారు. సరిగ్గా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసే రోజే ఈ ఘటన జరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

గాయం కారణంగా కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న శుభ్‌మన్ గిల్.. పంజాబ్ తరపున విజయ్ హజారే ట్రోఫీలో ఆడి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగా శనివారం (జనవరి 3) సిక్కింతో జరిగే మ్యాచ్ కోసం ఆయన చండీగఢ్ నుంచి జైపూర్ చేరుకున్నారు. అయితే మ్యాచ్‌కు ముందు ఆహారం తీసుకున్న తర్వాత గిల్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. స్పోర్ట్‌స్టార్ కథనం ప్రకారం.. ఆయన తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్‌తో బాధపడుతున్నారని, అందుకే మ్యాచ్ ఆడలేకపోయారని తెలిసింది.

గిల్ అనారోగ్యంపై ఆందోళన కలగడానికి మరో ముఖ్య కారణం ఉంది. న్యూజిలాండ్‌తో త్వరలో జరగబోయే వన్డే సిరీస్ కోసం టీమిండియాను ఇవాళే ఎంపిక చేయాల్సి ఉంది. వన్డే ఫార్మాట్‌లో జట్టు కెప్టెన్‌గా ఉన్న గిల్.. సిరీస్ నాటికి కోలుకుంటారా? లేదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. గతేడాది అక్టోబర్‌లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గిల్ దురదృష్టం వెంటాడుతూనే ఉంది. సౌతాఫ్రికా సిరీస్‌కు గాయం వల్ల దూరమవ్వగా.. ఇప్పుడు అనారోగ్యం చుట్టుముట్టింది.

గిల్‌తో పాటే మ్యాచ్ కోసం వచ్చిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మాత్రం అదరగొడుతున్నారు. గిల్ అందుబాటులో లేకపోయినా, అర్ష్‌దీప్ తన స్పెల్ మొదలుపెట్టిన తొలి రెండు ఓవర్లలోనే వికెట్లు తీసి పంజాబ్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. గిల్ మాత్రం ఇప్పుడు జనవరి 6న గోవాతో జరిగే తదుపరి మ్యాచ్ వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ అప్పటికి కూడా గిల్ కోలుకోకపోతే న్యూజిలాండ్ సిరీస్‌లో ఆయన ఆడటం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

శుభ్‌మన్ గిల్ గతేడాది కాలంగా కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడగలిగారు. కెప్టెన్సీ హోదాలో ఉండి కూడా జట్టుకు దూరం కావడం సెలక్టర్లను ఆలోచనలో పడేస్తోంది. ఫిట్‌నెస్ సమస్యలు ఇలాగే కొనసాగితే కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ ప్రత్యామ్నాయాల వైపు చూసే అవకాశం ఉంది. గిల్ త్వరగా కోలుకుని మళ్లీ తన క్లాస్ బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను అలరించాలని అందరూ కోరుకుంటున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి