Womens World Cup 2025: వార్నీ.. ఇదేందిది.. గెలిచిన ట్రోఫీని ఐసీసీకి ఇచ్చేస్తోన్న టీమిండియా.. కారణం ఇదే

Team India: 2025 మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు తొలిసారిగా మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. అయితే, ఈ విజయం తర్వాత తొలిసారి అందుకున్న ట్రోఫీని ఐసీసీకి అందించాల్సి ఉంది.

Womens World Cup 2025: వార్నీ.. ఇదేందిది.. గెలిచిన ట్రోఫీని ఐసీసీకి ఇచ్చేస్తోన్న టీమిండియా.. కారణం ఇదే
Icc Womens World Cup 2025

Updated on: Nov 05, 2025 | 12:35 PM

Womens World Cup 2025: భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయం తర్వాత, టీం ఇండియా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న ప్రపంచ కప్ ట్రోఫీని అందుకుంది. కానీ ఐసీసీ నిబంధనల కారణంగా ఈ ట్రోఫీని భారత జట్టు నుంచి తిరిగి తీసుకుంటారు. ఐసీసీ టోర్నమెంట్ గెలిచిన ఏ జట్టుకూ అసలు ట్రోఫీని అందజేయరు. బదులుగా విజేత జట్టుకు డమ్మీ లేదా రెప్లికా ట్రోఫీని ఇస్తారు. అవార్డుల ప్రదానోత్సవ సమయంలో అసలు ట్రోఫీని ప్రదానం చేస్తారు. ఫొటోషూట్ తర్వాత, అది ఐసీసీకి తిరిగి వస్తుంది.

ట్రోఫీకి సంబంధించి ఐసీసీ నియమాలు ఏమిటంటే?

26 సంవత్సరాల క్రితం ఐసీసీ ఒక నియమాన్ని ఏర్పాటు చేసింది. దాని ప్రకారం విజేత జట్టు ట్రోఫీని అందుకోవాలి. దానిని ఫోటోలు, విజయోత్సవ కవాతులకు ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత దానిని తిరిగి ఐసీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఐసీసీ విజేత జట్టుకు బంగారం, వెండితో సహా నిజమైన దానిని పోలి ఉండే డమ్మీ ట్రోఫీని ప్రదానం చేస్తుందన్నమాట. అయితే, అసలు ట్రోఫీని ఐసిసి దుబాయ్ ప్రధాన కార్యాలయంలో ఉంచుతారు.

మహిళల ప్రపంచ కప్ 2025 ట్రోఫీ వివరాలు..

2025 మహిళల ప్రపంచ కప్ ట్రోఫీ బరువు 11 కిలోలు. దాదాపు 60 సెం.మీ. ఎత్తు ఉంటుంది. ఇది వెండి, బంగారంతో తయారు చేస్తారు. ఇందులో మూడు వెండి స్తంభాలు స్టంప్స్, బెయిల్స్ ఆకారంలో ఉంటాయి. దీని పైభాగం గుండ్రని బంగారు గ్లోబ్. ట్రోఫీలో ఆల్ టైమ్ విజేతల పేర్లు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం, భారత జట్టు పేరును ట్రోఫీలో మొదటిసారిగా చేర్చారు. మహిళల ప్రపంచ కప్‌లో 13 ఎడిషన్లు జరిగాయి. ఆస్ట్రేలియా ఏడు సార్లు గెలిచింది. ఇంగ్లాండ్ నాలుగు టైటిళ్లను గెలుచుకోగా, న్యూజిలాండ్, భారత జట్టు ఒక్కొక్కటి గెలిచాయి.

ఇవి కూడా చదవండి

మహిళల ప్రపంచ కప్‌లో భారత్ ప్రస్థానం..

నవీ ముంబైలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళా క్రికెట్ జట్టు 298 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా దక్షిణాఫ్రికా జట్టు 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫైనల్‌లో షఫాలీ వర్మ 87 పరుగులు చేసి రెండు వికెట్లు పడగొట్టింది. ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. దీప్తి శర్మ కూడా అద్భుతంగా రాణించి 58 పరుగులు చేసి ఐదు వికెట్లు పడగొట్టింది. దక్షిణాఫ్రికా తరపున, కెప్టెన్ లారా వోల్వార్డ్ 101 పరుగులతో ఆకట్టుకున్నా.. ఆమె జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టలేకపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..