Suryakumar Yadav :స్కై వివాదంలో ఊహించని ట్విస్ట్..నటి ఖుషీ ముఖర్జీపై రూ.100కోట్ల పరువు నష్టం దావా

Suryakumar Yadav : టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను వివాదంలోకి లాగిన నటి ఖుషీ ముఖర్జీకి ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సూర్య తనకి మెసేజ్‌లు చేసేవాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోర్టు మెట్లెక్కాయి. ఈ వ్యవహారంలో సూర్యకు మద్దతుగా ఒక సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ ఏకంగా 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు.

Suryakumar Yadav :స్కై వివాదంలో ఊహించని ట్విస్ట్..నటి ఖుషీ ముఖర్జీపై రూ.100కోట్ల పరువు నష్టం దావా
Suryakumar Yadav

Updated on: Jan 16, 2026 | 9:01 AM

Suryakumar Yadav : టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై నటి ఖుషీ ముఖర్జీ చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సూర్య తనకు పదే పదే మెసేజ్‌లు పంపేవాడని ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని, కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని ముంబైకి చెందిన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ ఫైజాన్ అన్సారీ మండిపడ్డారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గాజీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా, 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు నమోదు కోసం ఫైజాన్ అన్సారీ ముంబై నుంచి స్వయంగా ఉత్తరప్రదేశ్ లోని గాజీపూర్ చేరుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి కీర్తి తెస్తున్న ఒక ఆటగాడి ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడటం సహించరాని నేరమని ఆయన పేర్కొన్నారు. కేవలం వార్తల్లో నిలవడానికి, ఫాలోయింగ్ పెంచుకోవడానికి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద బురద చల్లడం ఫ్యాషన్ అయిపోయిందని అన్సారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖుషీ ముఖర్జీపై కఠినమైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మీడియాతో మాట్లాడిన ఫైజాన్ అన్సారీ ఒక సవాల్ విసిరారు. ఒకవేళ ఖుషీ ముఖర్జీ తన దగ్గర ఉన్న ఆధారాలతో సూర్యకుమార్ యాదవ్ తనకు మెసేజ్‌లు చేశాడని నిరూపిస్తే, తాను బహిరంగంగా క్షమాపణ చెబుతానని అన్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే మాత్రం ఆమె శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇది కేవలం సూర్యకుమార్ వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని, భారత క్రికెట్ ప్రతిష్టకు సంబంధించిన ఇష్యూ అని ఆయన చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో తనకు ఉన్న ఫాలోయింగ్‌తో ఈ విషయాన్ని ప్రతి ప్లాట్‌ఫామ్‌లో ఎండగడతానని ఆయన హెచ్చరించారు.

గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఖుషీ ముఖర్జీ మాట్లాడుతూ.. సూర్యకుమార్ యాదవ్ తనకు ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ లు చేసేవాడని, కానీ తనకి, సూర్యకి మధ్య ఎలాంటి ప్రేమాయణం లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే అసలు మెసేజ్‌లే చేయని వ్యక్తి గురించి అలా చెప్పడం తప్పు అని సూర్య అభిమానులు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఈ 100 కోట్ల దావాతో ఖుషీ ముఖర్జీ డైలమాలో పడింది. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందో లేక ముదురుతుందో చూడాలి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..