Cricket: పాయే.. ఇజ్జతంతా పాయే.. 9 మంది బ్యాటర్లు 20 ఓవర్లలో 10 పరుగులు కూడా చేయలేకపోయారు..

|

Jan 04, 2023 | 5:22 PM

క్రికెట్‌లో అప్పుడప్పుడూ అనూహ్య సంఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. టీ20లు అంటేనే కచ్చితంగా మెరుపు ఇన్నింగ్స్‌లు తప్పవు..

Cricket: పాయే.. ఇజ్జతంతా పాయే.. 9 మంది బ్యాటర్లు 20 ఓవర్లలో 10 పరుగులు కూడా చేయలేకపోయారు..
Cricket News
Follow us on

క్రికెట్‌లో అప్పుడప్పుడూ అనూహ్య సంఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. టీ20లు అంటేనే కచ్చితంగా మెరుపు ఇన్నింగ్స్‌లు తప్పవు. కానీ ఈ ఫార్మాట్‌లోనూ కొన్ని సందర్భాల్లో బ్యాట్స్‌మెన్లపై బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇప్పుడు అదే సీన్ న్యూజిలాండ్‌లో జరుగుతున్న సూపర్ స్మాష్ టోర్నమెంట్‌లోనూ కనిపించింది. వెల్లింగ్టన్, నార్తర్న్ డిస్ట్రిక్ట్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో వెల్లింగ్టన్ మహిళలు అద్భుత విజయాన్ని అందుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెల్లింగ్టన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఇక చిన్న లక్ష్యం.. ప్రత్యర్ధి జట్టు ఈజీగా చేదిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సీన్ కాస్తా రివర్స్ అయింది. నార్తర్న్ డిస్ట్రిక్ట్ జట్టు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆ జట్టుకు చెందిన ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఫలితంగా వెంటవెంటనే వికెట్లు పడటం మొదలయ్యాయి.

141 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ జట్టులోని 9 మంది బ్యాటర్లు పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయారు. క్రీజులోకి వచ్చిరాగానే వెనువెంటనే పెవిలియన్‌కు క్యూ కట్టారు. నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ తరపున 8వ నెంబర్‌లో బరిలోకి దిగిన బ్యాటర్(32) టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఈ ఇన్నింగ్స్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ జట్టు 20 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి కేవలం 81 పరుగులు చేయగలిగింది. దీంతో వెల్లింగ్టన్ మహిళల జట్టు 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. వెల్లింగ్టన్ బౌలర్లలో 33 ఏళ్ల సోఫియా డివైన్, కాస్పెరేక్ చెరో 2 వికెట్లు పడగొట్టి.. ప్రత్యర్ధి పతనంలో కీలక పాత్ర పోషించారు. కాగా, సూపర్ స్మాష్‌ టోర్నమెంట్‌లోని మహిళల మ్యాచ్‌లో వెల్లింగ్టన్ గెలుపొందగా.. పురుషుల మ్యాచ్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో వెల్లింగ్టన్ జట్టు ఓటమిపాలైంది.