
విండీస్ పర్యటనకు సంబంధించి జట్టు ఎంపికపై బీసీసీఐ సెలక్షన్ కమిటీని మరోసారి తప్పుపట్టాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ఈ సిరీస్ వల్ల టీమిండియాకు ఒరిగింది ఏంటని ప్రశ్నించారు. ఎలాంటి ప్రాధ్యానత లేని పర్యటనలో జట్టు ప్రధాన ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మంచి స్కోర్లు సాధించడం తప్పితే.. ఇంకేం కొత్తగా జరిగిందని దుయ్యబట్టాడు. ఇటీవల విండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి టెస్టులో భారత జట్టు అద్భుత విజయం సాధించినప్పటికీ.. రెండో మ్యాచ్‌లో వర్షం అంతరాయం కారణంగా.. టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(266) టీమిండియా తరపున చక్కటి ప్రదర్శన కనబరిచారు. ఈ నేపధ్యంలో గవాస్కర్ సెలక్షన్ కమిటీ తీరుపై మరోసారి మండిపడ్డాడు.
‘ఎప్పటిలానే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పరుగులు రాబట్టారు. ఇంతకన్నా టెస్టు సిరీస్‌లో ఒరిగిందేముంది. వాళ్ల ప్లేస్‌లో ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేవని అనుకోవాలా. ఈ ఇద్దరినీ పక్కనపెట్టి.. యువ ప్లేయర్స్‌ను ప్రయత్నించాలని అనుకోలేదా.? వాళ్లను ఆడిస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌ను ఎలా తట్టుకోగలరో తెలిసేదిగా’ అంటూ సునీల్ గవాస్కర్ బీసీసీఐ సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా అజిత్ అగార్కర్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఇక మీదటైనా.. జట్టు ఎంపిక విషయంలో మార్పులు ఉంటాయని భావిస్తున్నట్లు సన్నీ చెప్పుకొచ్చాడు. కాగా, గతంలోనూ టెస్టు జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకోకపోవడంపై సునీల్ గవాస్కర్ బీసీసీఐ సెలక్షన్ టీమ్ నిర్ణయాలను తప్పుబట్టిన విషయం విదితమే.