Sunil Gavaskar : వాడిని జైల్లో వేసి, తాళం చెవి పారేయండి.. ఇండోర్ ఘటన పై గవాస్కర్ ఫైర్

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సందర్భంగా ఇండోర్‎లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లపై జరిగిన వేధింపుల ఘటనపై భారత దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కేసులో నిందితుడిని జైల్లో బంధించి, తాళం చెవిని పారేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితుడికి అత్యంత కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

Sunil Gavaskar : వాడిని జైల్లో వేసి, తాళం చెవి పారేయండి.. ఇండోర్ ఘటన పై  గవాస్కర్ ఫైర్
Sunil Gavaskar

Updated on: Oct 28, 2025 | 11:11 AM

Sunil Gavaskar : మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సందర్భంగా ఇండోర్‎లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లపై జరిగిన వేధింపుల ఘటనపై భారత దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కేసులో నిందితుడిని జైల్లో బంధించి, తాళం చెవిని పారేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితుడికి అత్యంత కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అతిథి దేవో భవ సంస్కృతికి భారతదేశం ప్రసిద్ధి అని చెబుతూనే, ఇలాంటి చర్యలను ఏ మాత్రం సహించకూడదని ఆయన స్పష్టం చేశారు.

ఇండోర్‌లో గురువారం (అక్టోబర్ 25న) ఉదయం ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇద్దరు వేధింపులకు గురైన ఘటన జరిగింది. ఈ సంఘటనపై సునీల్ గవాస్కర్ ఇండియా టుడేతో మాట్లాడారు. 76 ఏళ్ల గవాస్కర్ దీనిని ఘోరమైన సంఘటనగా అభివర్ణించారు. నిందితుడికి కఠిన శిక్ష పడాలని ఆకాంక్షించారు. అతన్ని జైల్లో వేసి తాళం చెవులు విసిరేయండి. అదే ఏకైక మార్గం అని నేను భావిస్తున్నానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారతదేశం ఎప్పుడూ అతిథి దేవో భవ మనస్తత్వానికి ప్రసిద్ధి అని, ఇలాంటి చర్యలు భారతదేశానికి చెడ్డపేరు తెస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేశాయి.

బీసీసీఐ కార్యదర్శి దేవ్జీత్ సైకియా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. భారతదేశం ఆతిథ్యానికి ప్రసిద్ధి అని, ఇలాంటి ఘటనలపై తమకు జీరో టాలరెన్స్ ఉంటుందని తెలిపారు. నిందితుడిని వెంటనే పట్టుకున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసుల చర్యను బీసీసీఐ అభినందించింది. అవసరమైతే భద్రతా ప్రోటోకాల్‌లను సమీక్షించి, మరింత కట్టుదిట్టం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ సంఘటన ఒకవైపు చర్చనీయాంశంగా మారగా, టోర్నమెంట్‌లో నాకౌట్ మ్యాచ్‌లు మరింత ఆసక్తిని రేపుతున్నాయి.

ఆస్ట్రేలియా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అలానా కింగ్ అద్భుతమైన బౌలింగ్‌తో 7/18 స్కోరు చేసి దక్షిణాఫ్రికాను 97 పరుగులకే కట్టడి చేసింది. ఈ విజయంతో, ఆస్ట్రేలియా మహిళల జట్టు నవీ ముంబైలో గురువారం (అక్టోబర్ 30న) భారత్‌తో సెమీఫైనల్‌లో తలపడనుంది. 2025 ప్రపంచకప్ సెమీఫైనల్స్ లైన్-అప్ (భారత్ vs ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా) అచ్చం 2017 ప్రపంచకప్ మాదిరిగానే ఉండడం విశేషం. 2017లో భారత్.. ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు వెళ్లింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..