
ధోని అభిమానులకు ఇది నిజంగా పండగలాంటి వార్తే. ఎందుకంటే తాజాగా ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 18 సంవత్సరాల పాటు జట్టుకు హెడ్ కోచ్‌గా సేవలందించిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఫ్రాంచైజీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఇరు పక్షాల మధ్య జరిగిన పరస్పర అంగీకారంతో కూడిన బహిరంగ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో సీఎస్‌కే కొత్త హెడ్ కోచ్ ఎవరు అనే అంశంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఫ్లెమింగ్ నిష్క్రమణతో భారత మాజీ కెప్టెన్, సీఎస్‌కే దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ధోనీ ఆట భవిష్యత్తుపై ఇప్పటికే అనేక ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆయన కోచింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశంపై అభిమానులు ఆసక్తిగా చర్చిస్తున్నారు.
అయితే ఇప్పటివరకు ధోనీని హెడ్ కోచ్‌గా నియమించనున్నట్లు సీఎస్‌కే యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ జట్టుతో ఆయనకు ఉన్న అనుబంధం, వ్యూహాత్మక ఆలోచన, నాయకత్వ లక్షణాల కారణంగా ఆయన పేరు సహజంగానే వినిపిస్తోంది. స్టీఫెన్ ఫ్లెమింగ్ 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో సీఎస్‌కే తరఫున ఆటగాడిగా బరిలోకి దిగారు. అనంతరం 2009లో హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరించి దాదాపు రెండు దశాబ్దాల పాటు జట్టును విజయవంతంగా నడిపించారు. ఆయన కోచింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు ఐపీఎల్ టైటిళ్లను, రెండు ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20 ట్రోఫీలను గెలుచుకుంది. అలాగే జట్టు రికార్డు స్థాయిలో 12 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంతో పాటు 10 సార్లు ఫైనల్ ఆడింది. ఫ్లెమింగ్ సీఎస్‌కే అనుబంధ జట్లైన జోబర్గ్ సూపర్ కింగ్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు కూడా ప్రధాన కోచ్‌గా సేవలందించారు.
OFFICIAL ANNOUNCEMENT
The Super Kings and Head Coach Stephen Fleming have mutually decided to part ways.
Together, we shared one of the most successful and enduring partnerships in IPL history. The legacy you’ve built will continue to inspire us.With immense respect and… pic.twitter.com/qjvb4oZUuU
— Chennai Super Kings (@ChennaiIPL) July 13, 2026
ఈ సందర్భంగా సీఎస్‌కే ఓనర్ రూపా గురునాథ్ మాట్లాడుతూ.. స్టీఫెన్ ఫ్లెమింగ్ ఫ్రాంచైజీ విజయ ప్రయాణంలో అత్యంత కీలక పాత్ర పోషించారని కొనియాడారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆయన జట్టు సంస్కృతి, గుర్తింపు, విజయ దృక్పథాన్ని నిర్మించారని పేర్కొన్నారు. ఆయన సేవలకు సీఎస్‌కే కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ఫ్లెమింగ్ కేవలం విజయవంతమైన కోచ్ మాత్రమే కాదని, జట్టులో క్రమశిక్షణ, వినయం, జట్టు ప్రయోజనమే ముఖ్యమనే సంస్కృతిని నెలకొల్పిన నాయకుడని అన్నారు. ప్రతి ఆటగాడిలోని ప్రతిభను వెలికితీయడంలో ఆయన ప్రత్యేక నైపుణ్యం కనబరిచారని ప్రశంసించారు.
ఫ్లెమింగ్ ఎమోషనల్..
ఇక స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా భావోద్వేగంగా స్పందించారు. సీఎస్‌కేతో గడిపిన 18 ఏళ్లు తన కోచింగ్ జీవితంలో అత్యంత విలువైన కాలమని చెప్పారు. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు, సవాళ్లు, మరపురాని జ్ఞాపకాలు తనకు లభించాయని పేర్కొన్నారు. సీఎస్‌కే ఎప్పటికీ తన హృదయానికి దగ్గరగానే ఉంటుందని, భవిష్యత్తులో కూడా జట్టును ప్రోత్సహిస్తూనే ఉంటానని తెలిపారు. కాగా, గత మూడు ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో కొత్త హెడ్ కోచ్ ఎంపిక జట్టు భవిష్యత్ ప్రణాళికల్లో కీలకంగా మారనుంది. ఇప్పుడు సీఎస్‌కే యాజమాన్యం ఎవరిని కోచ్‌గా ఎంపిక చేస్తుందన్న అంశంపై అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి