Sourav Ganguly : భారత బ్యాటర్లలో ధైర్యం నింపిన గంగూలీ..ఇక మైదానంలో పరుగుల సునామీ ఖాయం

Sourav Ganguly : టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభంలోనే టీమిండియాకు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. పసికూన అమెరికా చేతిలో భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, టీమిండియా మాజీ కెప్టెన్, దాదా సౌరవ్ గంగూలీ మాత్రం మన కుర్రాళ్లకు తన పూర్తి మద్దతు ప్రకటించారు.

Sourav Ganguly : భారత బ్యాటర్లలో ధైర్యం నింపిన గంగూలీ..ఇక మైదానంలో పరుగుల సునామీ ఖాయం
Sourav Ganguly

Updated on: Feb 09, 2026 | 12:24 PM

Sourav Ganguly : టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభంలోనే టీమిండియాకు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. పసికూన అమెరికా చేతిలో భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, టీమిండియా మాజీ కెప్టెన్, దాదా సౌరవ్ గంగూలీ మాత్రం మన కుర్రాళ్లకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఒక్క ఓటమితో భయపడాల్సిన పనిలేదని, దూకుడుగా ఆడటమే టీ20 మంత్రమని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్(BCPL) సీజన్ 4 సందర్భంగా సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడారు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడటంపై ఆయన స్పందించారు. “టీ20 క్రికెట్ అంటేనే అది.. మీరు బంతిని బాదుతూనే ఉండాలి. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వంటి వారు అద్భుతమైన ప్లేయర్లు. వారు గత కొంతకాలంగా ఇదే శైలిలో ఆడుతున్నారు. ఎప్పుడూ కొట్టాలని చూసినప్పుడు కొన్నిసార్లు వికెట్లు పడటం సహజం.. ఎందుకంటే వారు కూడా మనుషులే కదా!” అని గంగూలీ వ్యాఖ్యానించారు.

టీమ్ ఇండియా కూర్పుపై గంగూలీ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. మన జట్టులో బ్యాటింగ్, బౌలింగ్, స్పిన్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లోనూ సరైన సమతుల్యత ఉందని ఆయన కొనియాడారు. “ప్రపంచకప్ ముందుకు సాగుతున్న కొద్దీ ఆటగాళ్లలో రిథమ్ పెరుగుతుంది. ఈ టోర్నీలో గెలవడానికి భారత్ అత్యంత ఫేవరెట్ జట్టు. టీమిండియాను ఓడించడం ఏ జట్టుకైనా చాలా కష్టమైన పని” అని గంగూలీ భరోసా ఇచ్చారు. టోర్నీ ప్రారంభంలో వచ్చే ఒడిదుడుకులు సహజమని, మన కుర్రాళ్ళు పుంజుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాక్ తీసుకున్న నిర్ణయంపై గంగూలీ విస్మయం వ్యక్తం చేశారు. ఇతర జట్లతో ఆడుతూ, కేవలం భారత్‌తో మ్యాచ్‌ను వదులుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. “ప్రపంచకప్‌లో ప్రతి పాయింట్ చాలా ముఖ్యం. టోర్నీ గెలవాలని వచ్చే ఏ జట్టూ పాయింట్లను వదులుకోవాలని అనుకోదు. పాకిస్థాన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో నాకు అర్థం కావడం లేదు” అని గంగూలీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఐసీసీ, పీసీబీ మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మెగా పోరుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..