
Smriti Mandhana : విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించడమే కాకుండా, భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. భారత మహిళల జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన 48 రోజుల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన మంధాన, తన అద్భుతమైన బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించింది. గత కొద్దిరోజులుగా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ, వాటన్నింటినీ పక్కన పెట్టి దేశం కోసం ఆడి మరోసారి తన సత్తా చాటింది.
ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన 25 పరుగులు మాత్రమే చేసినప్పటికీ ఒక భారీ మైలురాయిని చేరుకుంది. అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రీడాకారిణిగా మంధాన రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్ స్మృతి మంధాన కావడం విశేషం. ఆమెకంటే ముందు న్యూజిలాండ్ దిగ్గజం సూజీ బేట్స్ మాత్రమే ఈ మార్కును దాటింది. అయితే స్మృతి మంధాన ఈ పరుగులను అత్యంత వేగంగా సాధించి సూజీ బేట్స్ రికార్డును బద్దలు కొట్టింది.
రికార్డుల వివరాల్లోకి వెళ్తే.. సూజీ బేట్స్ 4000 పరుగులు పూర్తి చేయడానికి 3675 బంతులు ఎదుర్కోగా, స్మృతి మంధాన కేవలం 3227 బంతుల్లోనే ఈ ఘనత సాధించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. అంటే అత్యంత తక్కువ బంతుల్లో 4000 టీ20 అంతర్జాతీయ పరుగులు చేసిన క్రీడాకారిణిగా మంధాన చరిత్ర పుటల్లోకెక్కింది. మైదానంలోకి రాగానే తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించిన ఆమె, జెమిమా రోడ్రిగ్స్‌తో కలిసి జట్టుకు బలమైన పునాది వేసింది.
గత ఒకటిన్నర నెలలుగా స్మృతి మంధాన జీవితంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు టీమిండియాను విశ్వవిజేతగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించి ఆనందంలో మునిగిపోతే, మరోవైపు వ్యక్తిగత కారణాలతో చివరి నిమిషంలో తన వివాహాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి మానసిక వేదనలోనూ ఆమె చూపిన పట్టుదల, క్రీడా స్ఫూర్తిని చూసి అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..