
Smriti Mandhana : భారత మహిళా క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్, డాషింగ్ బ్యాటర్ స్మృతి మంధాన పెళ్లి సందడి మొదలైంది. రేపు (నవంబర్ 23) మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్ఛల్‌ను పెళ్లి చేసుకోబోతున్న స్మృతి మంధాన, తాజాగా జరిగిన తన హల్దీ వేడుకతో అభిమానులను ఆకట్టుకుంది. ఈ వేడుకలో మంధాన తన భారతీయ టీమ్ మేట్స్‌తో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. అంతా పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతూ ఆ వేడుకకు ప్రత్యేక కళ తీసుకొచ్చారు.
మంధాన హల్దీ వేడుక డ్యాన్స్ ఫ్లోర్‌పై ఏకంగా ఏడుగురు భారత క్రికెట్ స్టార్లు సందడి చేశారు. షఫాలీ వర్మ, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్, శివాలి షిండే, రాధా యాదవ్, జెమీమా రోడ్రిగ్స్ వంటి ఆటగాళ్లు అందరూ పసుపు దుస్తుల్లో వచ్చి హల్దీ థీమ్‌కు మ్యాచ్ అయ్యారు. అందరూ కలిసి ఉత్సాహంగా పెళ్లి పాటలకు డ్యాన్స్ చేస్తూ, మంధాన పెళ్లి వేడుకను పండుగలా మార్చేశారు. ఈ స్నేహం, టీమ్ స్పిరిట్ చూడముచ్చటగా ఉంది. వరల్డ్ కప్ విన్నర్ షఫాలీ వర్మ, ఈ డ్యాన్స్ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దానికి లడ్కీ వాలే(వధువు తరపువారు) అని క్యాప్షన్ ఇచ్చింది.
ఈ వేడుక కేవలం పసుపు వేడుక మాత్రమే కాదు, ఇదొక చిన్న క్రికెట్ రీయూనియన్ లా మారింది. ఇటీవల మహిళల వరల్డ్ కప్ గెలిచిన జట్టులోని సభ్యులు—షఫాలీ, రాధా, రిచా, రేణుక, జెమీమా అందరూ కలిసి మంధాన పెళ్లి వేడుకలో పాల్గొనడం హైలైట్‌గా నిలిచింది. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో స్మృతి మంధాన సహచర క్రీడాకారిణి అయిన శివాలి షిండే కూడా ఈ సెలబ్రేషన్‌లో భాగమైంది. చాలా రోజుల తర్వాత పబ్లిక్‌గా కనిపించిన శ్రేయాంక పాటిల్ కూడా ఈ వేడుకలో పాల్గొనడం అభిమానులను ఆకట్టుకుంది.
స్మృతి మంధాన గురువారం రోజు తన టీమ్ మేట్స్‌తో కలిసి బాలీవుడ్ పాట సంఝో హో హీ గయాకు డ్యాన్స్ చేస్తూ సరదాగా తన ఎంగేజ్‌మెంట్‌ను కన్ఫర్మ్ చేసింది. శుక్రవారం రోజు పలాష్ ముచ్ఛల్ ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో భారత్ వరల్డ్ కప్ గెలిచిన ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం పిచ్‌పై మంధాన కళ్లకు గంతలు కట్టి తీసుకొచ్చి, మోకాలిపై కూర్చుని ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఆమె యస్ చెప్పింది అంటూ పలాష్ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు.
కాగా స్మృతి మంధాన ఇటీవల ముగిసిన వరల్డ్ కప్‌లో అద్భుతంగా ఆడింది. ఆమె 9 ఇన్నింగ్స్‌లలో 434 పరుగులు చేసి, ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రీడాకారిణిగా నిలిచింది. ఫైనల్‌లో కూడా 45 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి, భారత్ టైటిల్ గెలవడంలో ముఖ్యపాత్ర పోషించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..