
IND A vs BAN A : రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025లో తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ A జట్టు బ్యాటింగ్ చూసి క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు. 18 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ స్కోరు 160 మార్కును కూడా దాటదేమో అనిపించింది. కానీ చివరి రెండు ఓవర్లలో బంగ్లా బ్యాట్స్‌మెన్ చూపించిన మెరుపు దాడితో ఆ లెక్కలన్నీ తారుమారు అయ్యాయి. కేవలం చివరి 12 బంతుల్లోనే 50 పరుగులు రాబట్టడంతో బంగ్లాదేశ్ A జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ అనూహ్య విధ్వంసానికి కారణం మెహరూబ్ హసన్ మెరుపు ఇన్నింగ్స్.
సాధారణంగా టీ20 క్రికెట్‌లో 19వ ఓవర్ అత్యంత కీలకం. ఈ ఓవర్‌ను వేసిన భారత బౌలర్ నమన్ ధీర్ బంగ్లా బ్యాట్స్‌మెన్ మెహరూబ్ హసన్ చేతిలో దారుణంగా దెబ్బతిన్నాడు. ఈ ఓవర్‌ను మెహరూబ్ సిక్సర్‌తో ప్రారంభించాడు. ఆ తర్వాత మూడవ, నాల్గవ బంతుల్లో వరుసగా మరో రెండు సిక్సర్లు కొట్టాడు. ఐదో బంతిని ఫోర్ కొట్టిన మెహరూబ్, ఆఖరి బంతిని కూడా మళ్లీ సిక్సర్‌గా మలిచాడు. ఈ ఓవర్‌లో మొత్తం 28 పరుగులు వచ్చాయి.
19వ ఓవర్‌లో 28 పరుగులు వచ్చిన తర్వాత, చివరి ఓవర్‌లో కూడా బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ ఏమాత్రం తగ్గలేదు. చివరి ఓవర్ బౌలింగ్ చేసిన వైశాఖ్ విజయ్ కుమార్ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్‌లో మొత్తం 22 పరుగులు వచ్చాయి. యాసిర్ అలీ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టగా, చివరి బంతికి మెహరూబ్ హసన్ మళ్లీ సిక్సర్ కొట్టాడు. దీంతో 18 ఓవర్లలో 144 పరుగుల వద్ద ఉన్న బంగ్లాదేశ్ A స్కోరు, చివరి రెండు ఓవర్లలో 50 పరుగులు రావడంతో 194 పరుగులకు చేరుకుంది.
ఈ భారీ స్కోరు సాధించడంలో ఇద్దరు బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్లు ముఖ్యపాత్ర పోషించారు. ఓపెనర్ హబీబుర్ రెహమాన్ సోహన్ 46 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అత్యధికంగా 65 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు స్థిరత్వం అందించాడు. చివరిలో బ్యాటింగ్‌కు వచ్చిన మెహరూబ్ హసన్ కేవలం 18 బంతుల్లోనే 6 సిక్సర్ల సాయంతో అజేయంగా 48 పరుగులు చేసి భారత బౌలర్లను చిత్తుచేశాడు.
బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ల ధాటికి భారత బౌలర్లు చాలా ఖరీదైన ప్రదర్శన ఇచ్చారు. నమన్ ధీర్ 2 ఓవర్లలో 33 పరుగులు (ఎకానమీ 16.50), వైశాఖ్ విజయ్ కుమార్ 4 ఓవర్లలో 51 పరుగులు, రమన్‌దీప్ సింగ్ 2 ఓవర్లలో 29 పరుగులు సమర్పించుకున్నారు. గుర్జప్నీత్ సింగ్ 2 వికెట్లు తీసినప్పటికీ, అతను కూడా 9.75 ఎకానమీతో 4 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..