Shubman Gill : గిల్ కెరీర్‌కు బీసీసీఐ చెక్.. వైస్ కెప్టెన్ అని కూడా చూడకుండా వరల్డ్ కప్ నుంచి గెంటివేత.. అసలు ఏం జరిగింది?

Shubman Gill : టీమిండియా స్టార్ ఓపెనర్, కాబోయే మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా భావించిన శుభ్‌మన్ గిల్‎కు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. 2026 టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో గిల్‌కు చోటు దక్కలేదు. వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న ఆటగాడిని ఏకంగా జట్టు నుంచే తప్పించడం క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

Shubman Gill : గిల్ కెరీర్‌కు బీసీసీఐ చెక్.. వైస్ కెప్టెన్ అని కూడా చూడకుండా వరల్డ్ కప్ నుంచి గెంటివేత.. అసలు ఏం జరిగింది?
Shubman Gill

Updated on: Dec 22, 2025 | 9:32 AM

Shubman Gill : టీమిండియా స్టార్ ఓపెనర్, కాబోయే మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా భావించిన శుభ్‌మన్ గిల్‎కు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. 2026 టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో గిల్‌కు చోటు దక్కలేదు. వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న ఆటగాడిని ఏకంగా జట్టు నుంచే తప్పించడం క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. గిల్ స్థానంలో సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా, ఇషాన్ కిషన్‌ను బ్యాకప్ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు.

బీసీసీఐ, సెలక్టర్ల మధ్య జరిగిన అంతర్గత గందరగోళమే గిల్ ఉద్వాసనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందే గిల్‌ను టీ20ల్లో కీలక ఆటగాడిగా, భవిష్యత్తు నాయకుడిగా మార్చాలని ఒక ప్రణాళిక రచించారు. విరాట్ కోహ్లీ గతంలో పోషించిన యాంకర్ పాత్రను (ఒకవైపు వికెట్ పడకుండా కాపాడుతూ ఇతరులకు అటాక్ చేసే అవకాశం ఇవ్వడం) గిల్‌కు అప్పగించాలని భావించారు. ఈ క్రమంలోనే గిల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఖాయమని భరోసా ఇచ్చారు. కానీ మారిన టీ20 ఫార్మాట్ వేగం ముందు గిల్ నెమ్మదైన ఆటతీరు టీమ్ మేనేజ్‌మెంట్‌ను అసంతృప్తికి గురిచేసింది.

గిల్ తన చివరి 15 టీ20 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 291 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. ఒకవైపు పవర్‌ ప్లేలో భారీ స్కోరు సాధించాలనే ఒత్తిడి, మరోవైపు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాలనే బాధ్యత.. ఈ రెండింటి మధ్య గిల్ నలిగిపోయాడు. స్ట్రైక్ రేట్ పడిపోవడంతో పాటు నిలకడగా పరుగులు రాకపోవడంతో సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. అదే సమయంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్, నిలకడగా రాణిస్తున్న సంజూ శాంసన్ వైపు మొగ్గు చూపారు.

ఈ మొత్తం ఎంపిక ప్రక్రియలో కమ్యూనికేషన్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. జట్టు ప్రకటన వచ్చే వరకు కూడా తనను తొలగిస్తున్నారనే విషయం గిల్‌కు తెలియదట. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గానీ, కోచ్ గౌతమ్ గంభీర్ గానీ అతడికి ఈ విషయం ముందే చెప్పకపోవడం చర్చనీయాంశమైంది. 25 ఏళ్ల వయసులోనే జట్టుకు నాయకత్వం వహిస్తాడని ఆశించిన ఆటగాడికి, ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచకప్ బెర్త్ మిస్ అవ్వడం అతడి కెరీర్‌కు పెద్ద ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..