Shubman Gill: రూ. 450 కోట్ల ఫ్రాడ్ కేసు.. గిల్‌తో పాటు మరో ముగ్గురికి సీఐడీ నోటీసులు

|

Jan 03, 2025 | 8:54 AM

భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ పోంజీ స్కామ్‌ బాధితుడిగా మారిపోయాడు. అధిక వడ్డీ ఆశలు కల్పించిన ఓ సంస్థలో పలువురు ప్లేయర్లు పెట్టుబడి పెట్టినట్లు బయటికి రావడం సంచలనంగా మారింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

Shubman Gill: రూ. 450 కోట్ల ఫ్రాడ్ కేసు.. గిల్‌తో పాటు మరో ముగ్గురికి సీఐడీ నోటీసులు
Gill
Follow us on

గుజరాత్‌తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోంజీ స్కామ్‌ సెగ క్రికెటర్లనూ తాకింది. బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి రూ.6 వేల కోట్లను సేకరించిన బీజెడ్‌ గ్రూప్‌ సీఈవో భూపేంద్ర సింగ్ ఝలాను ఇప్పటికే గుజరాత్ సీఐడీ అరెస్ట్‌ చేసింది. అయితే గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తోపాటు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ వంటి పలువురు ప్లేయర్లు ఇందులో పెట్టుబడి పెట్టినట్లు లెటెస్ట్‌గా బయటకొచ్చింది. బీజెడ్ గ్రూప్‌నకు చెందిన రూ.450 కోట్లకు సంబంధించి లావాదేవీలపై సీఐడీ ఆరా తీస్తోంది. అందులో భాగంగా గుజరాత్ క్రికెటర్లకు సమన్లు జారీ చేయనుంది.

వారి నుంచి వివరాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనుంది. గిల్ రూ. 1.95 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. మిగతా క్రికెటర్లు తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండడంతో.. భారత్‌కు వచ్చాక గిల్‌కు సమన్లు జారీ చేసి.. విచారణ చేపట్టే అవకాశం ఉంది. తమ సంస్థ ద్వారా బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తామని గుజరాత్‌లోని పలు ప్రాంతాల ప్రజలను భూపేంద్ర సింగ్ నమ్మించారు. కొద్దికాలం తర్వాత సంస్థ పనితీరుపై అనుమానం రావడంతో ఈ విషయంపై మూడు నెలల క్రితం కొందరు వ్యక్తులు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు సంస్థకు చెందిన 10 మందికి పైగా ఏజెంట్లను అధికారులు అరెస్ట్‌ చేశారు. ప్రజల డబ్బుతో నిందితుడు విలాసవంతమైన కార్లు, భవనాలు కొనుగోలు చేసినట్లు, వివిధ విద్యాసంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి