
Shreyas Iyer : టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు ఆరంభంలోనే తీవ్రమైన ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టి20 ప్రపంచకప్ గెలిచిన పటిష్టమైన భారత జట్టుకు అతను కెప్టెన్సీ వహిస్తున్నప్పటికీ, గత ఐదు మ్యాచ్‌లలో ఏకంగా నాలుగు మ్యాచ్‌ల్లో టీమిండియా పరాజయం పాలైంది. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయింది. దీనికి తోడు బ్యాటర్‌గానూ శ్రేయస్ అయ్యర్ పెద్దగా పరుగులు చేయలేకపోతుండటంతో అతని కెప్టెన్సీపై సోషల్ మీడియాలో, క్రికెట్ వర్గాల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ కష్టకాలంలో శ్రేయస్ అయ్యర్‌కు అతని సోదరి శ్రేష్ఠ అయ్యర్ సపోర్టుగా నిలిచారు. తన తమ్ముడిని విమర్శిస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫిల్మీగ్యాన్ నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో శ్రేష్ఠ అయ్యర్ పాల్గొని శ్రేయస్ కెప్టెన్సీపై మాట్లాడారు. “పరిస్థితులు ఎల్లప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. బయట కూర్చుని మాట్లాడటం మన అందరికీ చాలా సులువు. కెప్టెన్ వరుసగా ఓడిపోతున్నాడు అని విమర్శించడం చాలా ఈజీ, కానీ క్రికెట్ అనేది కేవలం గెలుపోటములకు మాత్రమే పరిమితం కాదు, దాని వెనుక చాలా విషయాలు ఉంటాయి. మ్యాచ్ జరిగే పిచ్ ఎలాంటిది? అది బౌలింగ్ పిచ్ ఆ లేక బ్యాటింగ్ పిచ్ ఆ అనేది మనకు తెలియదు. కొన్నిసార్లు మనం టాస్ గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. వీటన్నింటి ప్రభావం మ్యాచ్‌పై ఉంటుంది. కానీ ప్రజలు కేవలం కెప్టెన్సీని మాత్రమే చూస్తారు. ఒక కెప్టెన్‌గా శ్రేయస్ గతంలో గెలిపించిన మ్యాచ్‌లను కూడా వారు గుర్తుంచుకోవాలి” అని శ్రేష్ఠ విమర్శకులకు హితవు పలికారు.
భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం, దానికి కెప్టెన్‌గా ఉండటం అంత సులువు కాదని శ్రేష్ఠ అభిప్రాయపడ్డారు. “మీరు దేశం కోసం ఆడుతున్నప్పుడు ఎన్నో సవాళ్లు, ఎంతో ఒత్తిడి మీతో పాటు వస్తాయి. ఇక్కడ మంచి కెప్టెన్ లేదా చెడ్డ కెప్టెన్ అని ఏమీ ఉండదు. ఇప్పటివరకు టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ప్రతి ఒక్కరూ జట్టు కోసం తమ వంతు అత్యుత్తమ ప్రదర్శన చేశారు. అది శుభ్‌మన్ గిల్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు లేదా రోహిత్ శర్మ కావచ్చు. ఇక ఎంఎస్ ధోనీ గురించి చెప్పక్కర్లేదు, ఆయన ఒక లెజెండ్. అయితే వీరందరూ కూడా తమ కెరీర్‌లో ఎన్నో మ్యాచ్‌లను ఓడిపోయారు. కానీ మీరు కేవలం శ్రేయస్ అయ్యర్ గురించి మాత్రమే నెగెటివ్‌గా మాట్లాడుతుంటే, మీలో అతనంటే ఏదో వ్యక్తిగత సమస్య ఉందనే అర్థం వస్తుంది” అని ఆమె ఘాటుగా స్పందించారు.
తన తమ్ముడి ప్రతిభపై తనకు పూర్తి నమ్మకం ఉందని శ్రేష్ఠ అయ్యర్ గర్వంగా చెప్పారు. “శ్రేయస్ ఒక అద్భుతమైన ఆటగాడు. అతని వ్యక్తిత్వం చాలా భిన్నమైనది. భారత క్రికెట్‌కు అతను అందించాల్సింది ఇంకా చాలా ఉంది. అతని దగ్గర ఉన్నంత ప్రతిభ, పట్టుదల మరెవరికీ లేవు. భవిష్యత్తులో అతను దేశానికి ఎంతో మంచి చేస్తాడని నాకు తెలుసు. ఆ సమయం చాలా త్వరలోనే రాబోతోంది.. ఎవరి దృష్టి పడకూడదు.. శ్రేయస్ అయ్యర్ భారతదేశపు అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడని అందరూ కొనియాడే రోజు చాలా దగ్గరలోనే ఉంది, ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది” అంటూ శ్రేష్ఠ అయ్యర్ భావోద్వేగంగా తన తమ్ముడికి మద్దతు పలికారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..