T20I Squad : టీమిండియాలో ఊహించని మార్పులు..రెండేళ్ల తర్వాత టీ20 జట్టులోకి సూర్య ఫ్రెండ్

Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ చివరిసారిగా డిసెంబర్ 2023లో టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోవడం, గాయాలు, సెంట్రల్ కాంట్రాక్ట్ వివాదాల వల్ల జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు మళ్ళీ తన సత్తా చాటుకోవడానికి అతనికి ఇదొక సువర్ణావకాశం.

T20I Squad : టీమిండియాలో ఊహించని మార్పులు..రెండేళ్ల తర్వాత టీ20 జట్టులోకి సూర్య ఫ్రెండ్
Shreyas Iyer

Updated on: Jan 17, 2026 | 8:18 AM

T20I Squad : టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అభిమానులకు ఒక శుభవార్త అందింది. సుమారు రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయ్యర్ మళ్ళీ భారత టీ20 జట్టులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించిన జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. గాయాల కారణంగా ఇద్దరు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కావడంతో, శ్రేయస్ అయ్యర్, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ అదృష్టం తలుపు తట్టింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ సైడ్ స్ట్రెయిన్ కారణంగా జట్టుకు దూరం కాగా, యువ సంచలనం తిలక్ వర్మ కూడా గాయం కారణంగా మొదటి మూడు టీ20 మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. దీంతో బీసీసీఐ సెలెక్టర్లు వెంటనే రంగంలోకి దిగి వారి స్థానంలో రిప్లేస్‌మెంట్లను ప్రకటించారు. సుందర్ స్థానంలో రవి బిష్ణోయ్‌ను, తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశారు.

శ్రేయస్ అయ్యర్ చివరిసారిగా డిసెంబర్ 2023లో టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోవడం, గాయాలు, సెంట్రల్ కాంట్రాక్ట్ వివాదాల వల్ల జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు మళ్ళీ తన సత్తా చాటుకోవడానికి అతనికి ఇదొక సువర్ణావకాశం. ఇక రవి బిష్ణోయ్ కూడా ఫిబ్రవరి 2025 తర్వాత మళ్ళీ బ్లూ జెర్సీ ధరించబోతున్నాడు. కివీస్ వంటి బలమైన జట్టుపై ఈ ఇద్దరూ రాణిస్తే, రాబోయే ప్రపంచకప్ రేసులో తమ స్థానాలను సుస్థిరం చేసుకోవచ్చు.

సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని ఈ జట్టులో సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా వంటి హేమాహేమీలు ఉన్నారు. అయితే వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్ రౌండర్ లేకపోవడం జట్టు సమతుల్యతపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ ఇప్పుడు వైస్ కెప్టెన్‌గా అదనపు బాధ్యతలు భుజాన వేసుకోనున్నాడు. శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ లోటును భర్తీ చేస్తాడని మేనేజ్మెంట్ గట్టిగా నమ్ముతోంది. కివీస్ గడ్డపై అయ్యర్ గతంలో మంచి రికార్డును కలిగి ఉండటం అతనికి కలిసొచ్చే అంశం.

టీమిండియా స్క్వాడ్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (కీపర్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (కీపర్), రవి బిష్ణోయ్.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..